రామ్ గోపాల్ వర్మ మళ్లీ బాక్సాఫీస్ రేసుకు వచ్చాడు. ఆయన కొత్త చిత్రం ‘మా ఇష్టం’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం చాన్నాళ్ల ముందే థియేటర్లలోకి దిగాల్సింది. కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. అందుక్కారణం.. ఇది లెస్బియన్ మూవీ కావడంతో థియేటర్లలో ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు ముందుకు రావట్లేదని, ఇదేం న్యాయమని వర్మ ఆరోపించాడు. దీని మీద ఆయన ట్విట్టర్ వేదికగా చేసిన పోరాటం ఫలించలేదు. వాస్తవానికి వర్మ సినిమా అంటే ఏమాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి లేకపోవడం వల్లే దీనికి థియేటర్లు దొరకలేదన్నది ఇండస్ట్రీ వర్గాల మాట.
ఐతే వాయిదాల మీద వాయిదాలు వేసుకుని ఎట్టకేలకు తన చిత్రాన్ని రిలీజ్ చేసేస్తున్నాడు వర్మ. ఈ రోజే ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అంటూ ట్విట్టర్లో ఘనంగా పోస్టర్లు కూడా వదిలాడు వర్మ. మరి ఈ చిత్రం ఎంత గ్రాండ్‌గా రిలీజవుతోందో తెలిస్తే షాకవ్వాల్సిందే. హైదరాబాద్ సిటీ మొత్తంలో ఒకే ఒక్క థియేటర్లో అది కూడా రోజుకు రెండు షోలు ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.
అబిడ్స్‌లోని సప్న సినిమాస్‌లో మార్నింగ్, మ్యాట్నీ షోల వరకు పరిమితం కాబోతోంది ‘మా ఇష్టం’.. అది కూడా వచ్చే బుధవారం వరకు, అంటే ఆరు రోజులు మాత్రమే. 12న మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ రిలీజవుతుండటంతో ఆ రోజు నుంచి వర్మ సినిమా ప్రదర్శన ఉండదు. హైదరాబాద్ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా సిటీలు, పట్టణాల్లో ఈ చిత్రానికి ఏమాత్రం థియేటర్లు ఇచ్చి ఉంటారన్నది సందేహం.
హైదరాబాద్ ఉర్దూలో తీసే లోకల్ సినిమాలు సైతం రెండో మూడో థియేటర్లలో రిలీజవుతుంటాయి. అలాంటిది వర్మ సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం విచిత్రం. ఒకప్పుడు వర్మ సినిమా అంటే హైదరాబాద్ సిటీ అంతా ఊగిపోయేది. పదుల సంఖ్యలో థియేటర్లలో పెద్ద ఎత్తున సినిమా రిలీజయ్యేది. టికెట్ల కోసం చాలా దూరం బారులు తీరేవారు జనాలు. అలాంటి స్థితి నుంచి ఇంత పెద్ద సిటీలో రోజుకు రెండు షోలు తన సినిమాను ఆడించుకోవాల్సిన పరిస్థితి వచ్చాడంటే వర్మ ఏ స్థాయిలో పతనం అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.