ఎన్టీఆర్ ఫ్యాన్స్.. నో టెన్ష‌న్!

త‌మ అభిమాన క‌థానాయ‌కుడితో సినిమా చేయ‌బోయే ద‌ర్శ‌కుడు.. దాని కంటే ముందు ప్ర‌తికూల ఫ‌లితాన్ని అందుకుంటే ఫ్యాన్స్‌లో ఆందోళ‌న మొద‌ల‌వుతుంది. అందులోనూ ఆ సినిమాకు మ‌రీ ఎక్కువ నెగెటివ్ టాక్ వ‌స్తే, త‌న స్థాయికి ఏమాత్రం త‌గ‌ని విధంగా సినిమా తీస్తే ఆందోళ‌న ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు కొర‌టాల శివ విష‌యంలో ఎన్టీఆర్ అభిమానులు ఇలాగే ఫీల‌వుతున్నారు. ఏడాది కింద‌టే కొర‌టాల‌.. ఎన్టీఆర్‌తో సినిమా క‌మిట‌వ‌డం తెలిసిందే.

జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత వీరి క‌ల‌యిక‌లో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వ‌రుస‌గా నాలుగు బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఇచ్చిన ద‌ర్శ‌కుడు కావ‌డం.. ఆర్ఆర్ఆర్‌తో ఎన్టీఆర్ ఇమేజ్ కూడా పెర‌గ‌డంతో ఈ కాంబోలో రాబోయే సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. చిరంజీవితో కొర‌టాల చేసిన ఆచార్య కూడా మినిమం గ్యారెంటీ మూవీ అయి ఉంటుంద‌ని.. క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని అంచ‌నా వేశారు. కానీ ఆచార్య అంచ‌నాల‌కు చాలా దూరంలో ఆగిపోయింది.

ఈ సినిమా నిజంగా కొర‌టాలే తీశాడా అనే సందేహాలు క‌లిగించే స్థాయిలో ఉంది ఆచార్య‌. పూర్తిగా ఆయ‌న త‌న ట‌చ్ కోల్పోయిన‌ట్లు అనిపించింది. మరి ఆచార్య‌ను ఇలా తీసిన కొరటాల తార‌క్‌తో ఎలాంటి సినిమా తీస్తాడో అన్న ఆందోళ‌న అత‌డి అభిమానుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో వారిలో ఒక ధీమా కూడా క‌నిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ కంటే ముందు తార‌క్ న‌టించిన అర‌వింద స‌మేతతో ఘ‌న‌విజ‌యాన్నందుకున్నాడు.

ఆ సినిమాకు ముందు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కూడా అజ్ఞాత‌వాసితో భారీ డిజాస్ట‌ర్ అందుకున్నాడు. కానీ త‌ర్వాత క‌సిగా అర‌వింద స‌మేత తీసి పెద్ద హిట్ కొట్టాడు. అంత‌కంటే ముందు సుకుమార్ కూడా 1 నేనొక్క‌డినేతో డిజాస్ట‌ర్ ఎదుర్కొన్నాడు. కానీ త‌ర్వాత తార‌క్‌తో నాన్న‌కు ప్రేమ‌తో తీసి విజ‌యాన్నందుకున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ సైతం టెంప‌ర్‌కు ముందు ఫ్లాపుల్లో ఉన్నాడు. కాబ‌ట్టి వీరి లాగే కొర‌టాల కూడా త‌న త‌ర్వాతి సినిమాకు క‌సిగా ప‌ని చేసి తార‌క్‌కు పెద్ద విజ‌యాన్నందిస్తాడ‌ని అభిమానులు ఆశిస్తున్నారు.