సినీ రంగం నుంచి పదేళ్లు గ్యాప్ తీసుకున్నా తన పవర్ ఏమీ తగ్గలేదని ఐదేళ్ల ముందు చాటి చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ ఆ సమయానికి నాన్ బాహుబలి రికార్డు బిజినెస్ చేసింది. వసూళ్ల పరంగా కూడా నాన్ బాహుబలి రికార్డును అందుకుంది. అప్పటికి బాహుబలి కాకుండా తొలి వంద కోట్ల షేర్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’నే కావడం విశేషం.
చిరు తర్వాతి సినిమా ‘సైరా’ కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి. ఇప్పుడు ‘ఆచార్య’ సైతం బిజినెస్ పరంగా చిరు స్థాయిని ఇంకొంచెం పెంచిందే తప్ప తగ్గించలేదు. విపరీతంగా ఆలస్యమైనా.. ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్-2’ లాంటి భారీ చిత్రాల సందడి తర్వాత కొంత మేర ప్రతికూల పరిస్థితుల్లో రిలీజవుతున్నా.. ‘ఆచార్య’కు బిజినెస్ మాత్రం ఒక రేంజిలోనే జరిగింది.
వరల్డ్ వైడ్ ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల వాల్యూ రూ.140 కోట్లు కావడం గమనార్హం.చిరుతో కలిసి చరణ్ పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న ‘ఆచార్య’ ముందు చాలా పెద్ద టార్గెట్ ఉన్నట్లే లెక్క. ఈ సగటు కమర్షియల్ చిత్రంతో రూ.140 కోట్ల టార్గెట్‌ను అందుకోవడం అంత తేలిక కాదు. తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి-2’ స్థాయికి చేరువలో ఈ చిత్ర రైట్స్ అమ్ముడవడం విశేషం. నైజాం ఏరియాలో ‘ఆచార్య’ టార్గెట్ రూ.39 కోట్లు కాగా.. సీడెడ్‌లో రూ.20 కోట్లకు కాస్త ఎక్కువగానే షేర్ రాబట్టాల్సి ఉంది. ఆంధ్రా ప్రాంతంలో మిగతా ఏరియాలన్నీ కలిపి ‘ఆచార్య’ 55 కోట్ల మేర ఈ చిత్రం బిజినెస్ చేసింది.
కర్ణాటక హక్కులు రూ.9 కోట్లు పలికాయి. ఓవర్సీస్ హక్కులు రూ.11 కోట్లకు అమ్మారు. పబ్లిసిటీ, ఇతర ఖర్చులు అన్నీ కలుపుకుంటే ఈ చిత్రం రూ.140 కోట్ల దాకా వరల్డ్ వైడ్ షేర్ రాబట్టాల్సి ఉంది. ఈ టార్గెట్‌ను అందుకోవాలంటే కేవలం వీకెండ్ వరకు సందడి చేస్తే సరిపోదు. రెండు వారాలైనా నిలకడగా వసూళ్లు రాబట్టాలి. కాబట్టి మెగా తండ్రీ కొడుకుల బాక్సాఫీస్ స్టామినాకు ఈ చిత్రం పెద్ద పరీక్ష కాబోతోందనడంలో సందేహం లేదు.