ఆచార్య క్లైమాక్స్‌.. చ‌ర‌ణ్ ఎలివేష‌న్

మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం అభిమానుల నిరీక్ష‌ణ‌కు మరికొన్ని గంటల్లో తెర‌ప‌డ‌బోతోంది. ఎప్పుడో నాలుగేళ్ల కింద‌ట మొద‌లైన ఆచార్య సినిమా ఎట్ట‌కేల‌కు ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. చిరుతో చ‌ర‌ణ్ స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం.. వ‌రుస‌గా నాలుగు బ్లాక్‌బ‌స్ట‌ర్‌లు అందించిన కొర‌టాల శివ ఈ చిత్రాన్ని రూపొందించ‌డంతో అంచ‌నాలు మామూలుగా లేవు.

సినిమాలో చాలా హైలైట్లే ఉంటాయ‌ని చిత్ర బృందం చెబుతోంది. చిరు-చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో సినిమా అంటే ప్రేక్ష‌కులు కోరుకునే మాస్, యాక్ష‌న్ అంశాల‌కు లోటే ఉండ‌ద‌ని అంతా అంటున్నారు. సినిమాలో మేజ‌ర్ హైలైట్ ఏంటి అని రామ్ చ‌ర‌ణ్‌ను అడిగితే.. క్లైమాక్స్ అని చెప్పాడు ఓ ఇంట‌ర్వ్యూలో. అలాంటి క్లైమాక్స్ చిత్రీక‌రించ‌డం అంత తేలిక కాద‌ని.. చూసే ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతి క‌లుగుతుంద‌ని అత‌ను అభిప్రాయ‌ప‌డ్డాడు.

ఆచార్య టీజ‌ర్లోనే రెడ్ క‌ల‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో చిరు శూలంతో రౌడీల్ని చీల్చి చెండాడే ఒక షాట్ హైలైట్ అయిన సంగ‌తి తెలిసిందే. అది క్లైమాక్స్‌లోని దృశ్య‌మేన‌ట‌. ఆచార్య‌ దేవాల‌యాల ర‌క్ష‌ణ చుట్టూ న‌డిచే క‌థాంశం కావ‌డంతో అందుకు త‌గ్గ‌ట్లే కుంకుమ బ్యాక్‌డ్రాప్‌తో ప‌తాక ఘ‌ట్టాన్ని తీర్చిదిద్దిన‌ట్లు చ‌ర‌ణ్ తెలిపాడు.

ఐతే అంత పెద్ద ఎత్తున లొకేష‌న్లో కుంకుమ పోసి దాని మ‌ధ్య ఫైట్ చిత్రీక‌రించ‌డం అంటే సామాన్య‌మైన విష‌యం కాద‌ని.. ఆ కుంకుమ పీలుస్తూ నిల‌బ‌డ్డ‌మే క‌ష్ట‌మంటే.. షూటింగ్ ఇంకా క‌ష్ట‌మ‌ని.. రెండు మూడు రోజుల‌కే అందరూ దాని దెబ్బ‌కు కింద ప‌డిపోతార‌నుకున్నాన‌ని.. అలాంటిది తొమ్మిది రోజులు చిత్రీక‌రణ జ‌రిపారంటే ఎంత క‌ష్ట‌ప‌డి ఉంటారో అర్థం చేసుకోవ‌చ్చ‌ని చ‌ర‌ణ్ అన్నాడు. కుంకుమ హైలైట్ అవుతూనే.. అది మ‌నుషుల‌ను డామినేట్ చేయ‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా కెమెరామ‌న్ తిరు, ఫైట్ మాస్ట‌ర్లు రామ్-ల‌క్ష్మ‌ణ్ క్లైమాక్స్ ఫైట్ పూర్తి చేశార‌ని.. వాళ్ల‌ను ఎంత పొగిడినా త‌క్కువే అని.. థియేట‌ర్ల‌లో ఈ ఘ‌ట్టం చూసి ప్రేక్ష‌కుల గొప్ప అనుభూతికి లోన‌వుతార‌ని చెప్పాడు.