చిరు స్టార్ అయ్యాక ఇలా జ‌ర‌గ‌లేదు

ఒక స్టార్ హీరో సినిమాలో ఆ హీరోకు జోడీగా క‌థానాయిక లేకపోవ‌డం అంటే టాలీవుడ్లో అస‌లు జ‌ర‌గ‌ని ప‌ని. ఎంత సీరియ‌స్ సినిమా అయినా.. క‌థాంశం ఎలాంటిదైనా హీరోకు జోడీగా హీరోయిన్ ఉండాల్సిందే. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమాలో ఆయ‌న ప‌క్క‌న హీరోయిన్ లేక‌పోవ‌డం అంటే ఏదో వెళితిగా ఉంటుంది. కెరీర్ ఆరంభంలో విల‌న్, క్యారెక్ట‌ర్ రోల్స్ చేసిన‌పుడు హీరోయిన్ లేకుండా కొన్ని సినిమాలు లాగించేశారు కానీ.. స్టార్ ఇమేజ్ వ‌చ్చాక మాత్రం చిరు ఎప్పుడూ క‌థానాయిక లేకుండా సినిమాలు చేసింది లేదు.

ఎంత వెతికి వెతికి చూసినా స్టార్ అయ్యాక‌ చిరు కెరీర్లో అలాంటి సినిమా క‌నిపించ‌దు. కానీ ఇప్పుడు ఊహించ‌ని విధంగా ఆచార్య సినిమాలో ఆయ‌న‌కు క‌థానాయిక లేకుండా పోయింది. ఐతే ఇది ముందు అనుకుని చేసింది కాదు. అనుకోకుండా అలా జ‌రిగిపోయింది.

ఆచార్య సినిమాలో క‌థానాయిక‌గా ముందు కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను ఎంపిక చేయ‌డం, ఆమె మీద కొన్ని స‌న్నివేశాలు, లాహే లాహే పాట షూట్ చేయ‌డం తెలిసిందే. లాహే లాహే ప్రోమోలో కూడా ఆమె క‌నిపించింది. కానీ మ‌ధ్య‌లో క‌థ మారిపోయింది. ఆచార్య పాత్ర‌కు ప్రేయ‌సిని పెట్ట‌డం వ‌ల్ల త‌న పాత్ర దెబ్బ తింటుంద‌ని, అలాగే కాజ‌ల్ లాంటి పెద్ద హీరోయిన్ని పెట్టి దానికి స‌రైన ముగింపునివ్వ‌కుంటే, నామ‌మాత్రంగా లాగించేస్తే బాగుండ‌ద‌ని ఆమె పాత్రను తీసేసిన‌ట్లు కొర‌టాల శివ వెల్ల‌డించ‌డం తెలిసిందే.

అలా చిరుకు హీరోయిన్ని పెట్టి కూడా తీసేయాల్సి వ‌చ్చింది. ఫైన‌ల్‌గా హీరోయిన్ లేకుండా చిరు సినిమా ఒక‌టి విడుద‌ల కాబోతోంది. దీన్ని ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇంత‌కుముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా బంగారంలో అత‌డికి హీరోయిన్ని పెట్ట‌లేదు. అందులో మీరా చోప్రా న‌టించినా.. ఆమె ప‌వ‌న్‌కు జోడీ కాదు. ఇది ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌లేదు. ఐతే సినిమాలో విష‌యం లేక అది పోయింది కానీ.. హీరోయిన్ లేక‌పోవ‌డం వ‌ల్ల అనలేం. కాబ‌ట్టి ఆచార్య విష‌యంలో ప్రేక్ష‌కుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.