మెగాస్టార్ చిరంజీవి వేదికల మీద హీరోయిన్ల గురించి మాట్లాడే మాటలు.. వారితో రొమాంటిగ్గా వ్యవహరించే తీరు అప్పుడప్పడూ చర్చనీయాంశం అవుతుంటుంది. ఏ అందమైన హీరోయిన్ని చూసినా.. ఆయన గుండె లయ తప్పుతుంటుంది. ఆ అమ్మాయితో నటించాలి.. తనతో డ్యాన్స్ చేయాలి అని చమత్కరిస్తుంటారు. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు ఇలాగే చేసేవారు. ఇప్పుడు ఆయన లేని లోటును చిరంజీవి తీరుస్తున్నట్లుగా అనిపిస్తోంది.
ఈ మధ్య సాయిపల్లవి గురించి మాట్లాడుతూ ఆయన తనలోని కొంటెదనాన్ని బయట పెట్టుకున్నారు. ఇప్పుడు ‘ఆచార్య’ ప్రమోషన్లలో భాగంగా చిరులోని రొమాంటిక్ యాంగిల్ మరోసారి బయటికి వచ్చింది. ఈ చిత్రం ఇంకో మూడు రోజుల్లోనే విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో చిరు, చరణ్, పూజా హెగ్డే, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుక చివర్లో ఫొటోల కోసం పోజులిస్తున్నపుడు చిరు విన్యాసాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి.
తన పక్కనే ఉన్న పూజా హెగ్డేతో కలిసి ఆయన ఫొటో దిగాలని ఆశపడ్డారు. అంతలో ఆమె ఆయన్ని చూడకుండా తన పక్కనున్న చరణ్‌తో కలిసి వేదిక నుంచి దిగిపోయే ప్రయత్నం చేసింది. ఆమె అటు వైపు తిరిగి ఉండగా చిరు ఆమె చేయిని అందుకోబోయే కుర్రాడిలా వెంట పడటం విశేషం.
చివరికి పూజా ఆయన్ని చూసి ఆశ్చర్యపోతుంటే.. చరణ్ ఆమెకు దూరంగా జరిగాడు. తర్వాత చిరు ఆమె భుజం మీద చేయి వేసి, అలాగే వాటేసుకోబోతున్నట్లు ఒక ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడంతో కెమెరామన్ల పంట పండింది. ఈ సందర్భంగా పూజా తెగ నవ్వుతూ.. మధ్యలో ఆయనకు సలాం కొడుతూ.. చిరును మరింత ఉత్సాహ పరిచింది. వయసు కేవలం అంకె మాత్రమే అని చాటుతూ చిరు కుర్రాడిలా వ్యవహరించిన తీరు సోషల్ మీడియాకు కావాల్సినంత కంటెంట్ ఇచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates