కరోనా మహమ్మారి చిన్నా పెద్దా అని తేడా ఏమీ చూడట్లేదు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని కూడా అది పలకరిస్తోంది. తెలంగాణలో ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా వైరస్ బారిన పడ్డారు. సినీ ప్రముఖుడు బండ్ల గణేష్ కూడా కరోనా బాధితుడయ్యాడు. తమిళనాట ఒక ఎమ్మెల్యే కరోనా బారిన పడి మరణించాడు.
ఈ కోవలోనే దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార కూడా కరోనా బాధితురాలిగా మారిందని.. ఆమెకు ఇంటి వద్దే వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఒక ప్రచారం నడిచింది. రెండు మూడు రోజులుగా ఈ ప్రచారం గట్టిగా జరగడంతో నయనతార, ఆమె కాబోయే భర్త విఘ్నేష్ శివన్ బాగా హర్టయినట్లున్నారు. ఓ వీడియో ద్వారా వాళ్లీ ప్రచారాన్ని ఖండించారు.
నయన్, విఘ్నేష్ చిన్నపిల్లల్లా మారిపోయి ఓ పాటకు డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఒక వీడియోను విఘ్నేష్ రిలీజ్ చేశాడు. తాము తమ గురించి వినిపించే జోక్‌లను ఇలాగే ఎంజాయ్ చేస్తామంటూ అతను కామెంట్ చేశాడు. తాను, నయన్ ఇంటి దగ్గర ఆరోగ్యంగా, సంతోషంగా గడుపుతున్నామని పేర్కొన్నాడు. తమ గురించి కొందరు జోకర్లు పేల్చే జోకులను బాగా ఎంజాయ్ చేస్తున్నామని కూడా అతనన్నాడు.
ఐతే కరోనా ఉందన్న ప్రచారాన్ని మామూలుగా ఖండిస్తే సరిపోయేది కానీ.. అది సోకడం మహా పాపం అన్నట్లు, నయన్ గురించి అలా రాస్తారా అన్నట్లుగా ఇలా కౌంటర్లు వేయడమే చిత్రంగా అనిపిస్తోంది. దీనికింత సీరియస్‌గా రియాక్టవ్వాలా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ వీడియోను బట్టి చూస్తే మాత్రం నయన్, విఘ్నేష్‌లను కరోనా వార్తలు బాగా హర్ట్ చేసినట్లే కనిపిస్తోంది.