అక్షయ్ క్షమాపణ.. టార్గెట్ మహేష్

జనాలపై సినీ తారల ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ హీరోలను రోల్ మోడల్స్ లాగా చూసే యువత తెరపై వాళ్లేం చేస్తే దాన్ని అనుసరిస్తారు. వాళ్లు ప్రచారం చేసే ఉత్పత్తులను కళ్లు మూసుకుని కొనేస్తుంటారు. ఇలాంటపుడు తాము ప్రచారం చేసే బ్రాండ్ల విషయంలో సినీ తారలు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ప్రకటనల్లో మౌత్ రిఫ్రెషర్స్ మాదిరి చూపిస్తూ గుట్కాలను ప్రమోట్ చేస్తుంటాయి కొన్ని కంపెనీలు.

వాటికి హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ప్రచారం చేయడం పట్ల ఎప్పట్నుంచో అభ్యంతరాలు ఉన్నాయి. కొందరు హీరోలు కోట్లు ఇస్తామన్నా కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. హాలీవుడ్ హీరో పియర్స్ బ్రాస్నెన్‌‌ వద్దకు ప్రమోషన్ కోసం జనాలకు హాని చేసే ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీలు వస్తే మిలియన్ డాలర్ల డీల్స్‌ను అతను వద్దనేశాడు. ఇండియాలో అమితాబ్ బచ్చన్ కూడా ఇలాంటి వాటికి తాను వ్యతిరేకం అనేశాడు. తాజాగా అక్షయ్ కుమార్ తాను ప్రచారం చేసిన ఒక పాన్ మసాలా బ్రాండు విషయంలో తీవ్ర వ్యతిరేకత వచ్చేసరికి అభిమానులకు సారీ చెబుతూ ఒక ప్రకటన రిలీజ్ చేశాడు.

అతడితో పాటు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ కలిసి ఓ పాన్ మసాలా బ్రాండుకు ప్రచారం చేశారు. ముగ్గురూ పద్మశ్రీ అవార్డీలయి ఉండి జనాల ఆరోగ్యాలకు హాని చేసే గుట్కా బ్రాండును ప్రచారం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అక్షయ్ ఆ బ్రాండ్ ప్రమోషన్ నుంచి తప్పుకుని సారీ చెప్పాడు. కాగా ఇలాంటి బ్రాండే టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌ను సంప్రదించి భారీగా పారితోషకం ఆఫర్ చేసినా ‘నో’ చెప్పినట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే.

కాగా మరో టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇలాంటి బ్రాండుకే ప్రచారం చేస్తుండటం పట్ల ముందు నుంచి అభ్యంతరాలు వ్యకమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి బ్రాండుకు బన్నీ నో చెప్పడం, అక్షయ్ వైదొలగడం.. ఈ నేపథ్యంలో నెటిజన్లు మహేష్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన చేతిలో అన్నేసి బ్రాండ్లున్నప్పుడు, మరిన్ని ఆఫర్లు ఉన్నపుడు ఇలాంటి హానికర బ్రాండుకు ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి సూపర్ స్టార్ ఇప్పుడైనా మనసు మార్చుకుంటాడేమో చూడాలి.