చిరు కోసం విజయశాంతి కాదు.. ఆమె?

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో తన రెండో రీమేక్ సినిమాకు రెడీ అవుతున్నారు. ‘కత్తి’ రీమేక్ ‘ఖైదీ నంబర్ 150’తో పునరాగమనం చేసిన ఆయన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’ రీమేక్‌లోనూ నటించబోతున్నట్లు సంగతి తెలిసిందే. ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కొన్ని నెలలుగా ఆ స్క్రిప్టు మీద పని చేస్తున్నాడు సుజీత్.

ఉన్నదున్నట్లు దించేయకుండా తెలుగు నేటివిటీకి, చిరు ఇమేజ్‌కు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేస్తున్నాడతను. ఈ సినిమాలో హీరో తర్వాత అంత కీలకమైంది ఒక లేడీ క్యారెక్టర్. హీరోతో రక్త సంబంధం ఉండదు కానీ.. వరుసకు సోదరి అయ్యే పాత్ర అది. ఒరిజినల్లో మోహన్ లాల్ హీరో పాత్ర చేయగా.. ఆ లేడీ క్యారెక్టర్లో మంజు వారియర్ నటించింది. తెలుగులో ఈ పాత్రను ఎవరు చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

ఈ మిడిలేజ్డ్ లేడీ క్యారెక్టర్లో పేరున్న నటి కనిపిస్తేనే బాగుంటుంది. ఆ పాత్రకు ఇంతకుముందు విజయశాంతి పేరు వినిపించింది. ‘సరిలేరు నీకెవ్వరు’తో రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. తర్వాత మళ్లీ బ్రేక్ తీసుకుంది. చిరు పక్కన కథానాయికగా డబుల్ డిజిట్ సినిమాలు చేసి, ఆయనతో పోటాపోటీగా నటించిన విజయశాంతి ఇప్పుడు ఆయనకు సోదరిగా నటిస్తే బాగుంటుందా అన్న ప్రశ్న తలెత్తింది. విజయశాంతి విషయంలో తర్వాత ఏ అప్ డేట్‌ కూడా లేదు.

ఐతే ఇప్పుడు ఈ పాత్రకు కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరు.. సుహాసిని కావడం విశేషం. ఈమె కూడా చిరుకు కథానాయికగా అనేక సినిమాల్లో నటించింది. ఐతే విజయశాంతితో పోలిస్తే సుహాసిని ఈ పాత్రకు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమెను సంప్రదించారని.. ఓకే అందని అంటున్నారు. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన రావచ్చని అంటున్నారు. చిరు తనయుడు రామ్ చరణే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.