కేజీఎఫ్-2తో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మూడున్నరేళ్ల కిందట కేజీఎఫ్-చాప్టర్ 1తోనే అతను హాట్ టాపిక్ అయ్యాడు. మీడియం రేంజ్ హీరోను పెట్టి ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు, ఓ మోస్తరు బడ్జెట్లో అలాంటి సినిమా తీయడం.. అంత పెద్ద హిట్ చేయడం మామూలు విషయం కాదు. విశేషం ఏంటంటే.. హీరో, దర్శకుల్లాగే ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు కూడా అంత పేరున్న వాళ్లేమీ కాదు. వాళ్ల నేపథ్యం కూడా సాధారణమైందే.
కేజీఎఫ్-2కు కేవలం 19 ఏళ్ల వయసున్న ఉజ్వల్ అనే కుర్రాడు ఎడిటింగ్ చేశాడని, అతను అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్, ఫ్యాన్ మేడ్ వీడియోలకు ఎడిటింగ్ చేసేవాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ చిత్ర ఛాయాగ్రహకుడైన భువన్ గౌడ ఏమో ఒక స్టిల్ ఫొటోగ్రాఫరట. ఇప్పుడు ఇంకో ఆశ్చర్యకర విషయం బయటికి వచ్చింది. అది సంగీత దర్శకుడు రవి బస్రూర్‌కు సంబంధించినది.
రవి బస్రూర్ తండ్రి గోల్డ్ స్మిత్ (బంగారం పని చేసే కార్మికుడు). వీరిది చాలా సాధారణ కుటుంబం. రవి సినిమాల్లోకి రావడానికి ముందు, వచ్చాక కూడా తండ్రికి సాయంగా తమ వారసత్వంగా వస్తున్న పని చేసేవాడు. అతడి తండ్రి ఇప్పటికీ అదే పనిని కొనసాగిస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ టైంలో ఇబ్బంది పడుతున్న తండ్రికి సాయంగా రవి కొలిమిలో బంగారాన్ని కాల్చి ఆభరణాలు తయారు చేశాడట. సంబంధిత ఫొటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడిగా నిలదొక్కుకోవడానికి ముందు రవి పడ్డ కష్టాల గురించి తెలిసిన వాళ్లు కథలు కథలుగా చెబుతున్నారు. కేజీఎఫ్-1 సినిమాతోనే రవి తన నేపథ్య సంగీతం, పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. చాప్టర్-2తో అతడి ఆర్ఆర్ మరింతగా చర్చనీయాంశం అయింది. ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్లను గుర్తించి ఇంత మంచి ఔట్ పుట్ రాబట్టుకున్న ప్రశాంత్‌ను ఎంత పొగిడినా తక్కువే.