ఇక ప్రెజ‌రంతా మ‌నోడి మీదే


టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ఇప్పుడు త‌న కెరీర్లోనే అతి పెద్ద స‌వాలుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. అత‌ను తొలిసారిగా ఓ ద్విభాషా చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అందులో హీరో త‌మిళ టాప్ స్టార్ విజ‌య్ కావ‌డం విశేషం. త‌మిళ ద‌ర్శ‌కులు తెలుగు హీరోల‌తో సినిమాలు చేయ‌డం ఎప్ప‌ట్నుంచో ఉన్న‌దే కానీ.. తెలుగు ద‌ర్శ‌కులు త‌మిళ స్టార్ల‌తో సినిమాలు చేసిన దాఖ‌లాలు అరుదు. అందులోనూ ఇప్పుడు త‌మిళంలో నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్న విజ‌య్.. వంశీతో జ‌ట్టు క‌ట్ట‌డం ఆస‌క్తిని రేకెత్తించేదే. ఐతే ఈ సినిమా ఓకే అయ్యే స‌మ‌యానికి.. ఇప్పటికి ప‌రిస్థితులు మారిపోయాయి.

అనౌన్స్‌మెంట్ స‌మ‌యానికి విజ‌య్‌తో ఎలాంటి సినిమా తీసిన ఓకే అన్న‌ట్లుండేది. యావ‌రేజ్ చిత్రాల‌తోనూ బ్లాక్‌బ‌స్ట‌ర్లు అందుకుంటూ విజ‌య్ కొన్నేళ్లుగా మామూలు ఊపులో లేడు. కానీ ఎప్పుడూ ప‌రిస్థితులు ఒక‌లా ఉండ‌వు.

ఇప్పుడు బీస్ట్ రూపంలో విజ‌య్‌కి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. త‌మిళనాట కూడా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వ‌సూళ్లు లేవు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అంతిమంగా ఇది ఫ్లాప్‌గా నిల‌వ‌డం గ్యారెంటీ.
హిందీలో ఒక‌ప్పుడు స‌ల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్.. విజ‌య్ లాగే యావ‌రేజ్ సినిమాల‌తో హిట్లు కొడుతూ, ఓపెనింగ్స్ తెచ్చుకుంటూ సంబ‌ర‌ప‌డిపోయారు. త‌ర్వాత క‌థ అడ్డం తిరిగి వారికి ఇబ్బందులు త‌ప్ప‌ట్లేదు. విజ‌య్‌కి కూడా యావ‌రేజ్ సినిమ‌లు రెండు మూడు ప‌డితే.. ఈ స్థితికే చేరేలా క‌నిపిస్తున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో వంశీ పైడిప‌ల్లితో అత‌ను సినిమా చేస్తున్నాడు.

బీస్ట్ దెబ్బ విజ‌య్ కంటే వంశీకి గ‌ట్టిగా త‌గిలేలా ఉంది. విజ‌య్ క‌చ్చితంగా పెద్ద హిట్ కొట్టాల్సిన స్థితిలో ఉండ‌టం వంశీ మీద ప్రెజ‌ర్‌ను బాగా పెంచేదే. అందులోనూ ఈ చిత్రంతో నేరుగా తెలుగులోకి అడుగు పెట్ట‌బోతున్నాడు విజ‌య్. అత‌డికిది తొలి ద్విభాషా చిత్రం. వంశీకి కూడా అంతే. కాబ‌ట్టి అత‌ను ఆషామాషీ సినిమా చేస్తే న‌డ‌వ‌దు. స్పెష‌ల్ ఎఫ‌ర్ట్ పెట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ డెలివ‌ర్ చేయాల్సిందే.