బాల ఎన్టీఆర్.. మురిపించి 25 ఏళ్లు

సరిగ్గా పాతికేళ్ల క్రితం తెలుగు వెండి తెరపై ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు పేరు.. జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు పెద్ద మాస్ హీరోగా ఎదిగిన ఈ నందమూరి వారసుడు పదేళ్ల వయసులోనే రాముడి పాత్రలో తెలుగు వారందరినీ మురిపించి తాతకు తగ్గ మనవడిని అనిపించుకున్నాడు. అతను చిన్నతనంలోనే ప్రధాన పాత్ర పోషించిన ‘బాల రామాయణం’ అప్పట్లో ఒక సంచలనం అనే చెప్పాలి.

అప్పటికే తెలుగు తెరపై రామాయణ గాథను చాలామంది చూపించారు కానీ.. అందరూ పిల్లల్నే ప్రధాన పాత్రలకు తీసుకుని ‘బాల రామాయణం’ తీయడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నాడు గుణశేఖర్. ఈ చిత్రాన్ని ఒక స్టార్ హీరో చిత్రం తరహాలో గొప్ప నిర్మాణ విలువలతో, రాజీ లేకుండా నిర్మించి నిర్మాతగా తన స్థాయిని చాటి చెప్పారు ఎం.ఎస్.రెడ్డి. తెలిసిన కథనే పిల్లలు ప్రధాన పాత్రధారులుగా చూసి తెలుగు ప్రేక్షకులు ఒక కొత్త అనుభూతికి లోనయ్యారు.

ఏకంగా ఈ సినిమా కోసం 3 వేల మంది పిల్లలు పని చేయడం విశేషం. సినిమాలో ఒక్కరూ పెద్దవారు కనిపించరు. వందలు వేల మందికి పెద్ద వారిగా మేకప్ వేయడం అంత తేలికైన విషయం కాదు. వారి ఆహార్యానికి తగ్గట్లే సెట్స్ కూడా తీర్చిదిద్దాల్సి వచ్చింది. అలాగే ఛాయాగ్రహణం విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రయత్నం వెనుక ఉన్న శ్రమ అలాంటిలాంటిది కాదు. అందుకు గుణశేఖర్ అండ్ టీంను ఎంత పొగిడినా తక్కువే. ఇక పిల్లలే అయినా పెద్ద వారిలాగే తీవ్రత చూపిస్తూ ఎన్టీఆర్ సహా ఒక్కో చైల్డ్ ఆర్టిస్ట్ చూపించిన నట ప్రతిభ కూడా ప్రత్యకమైంది. అందుకే ఈ చిత్రం జాతీయ అవార్డును సైతం అందుకుంది.

1997 సంవత్సరానికి జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా పురస్కారం అందుకుంది. అలాగే ఈ చిత్రానికి రెండు నంది అవార్డులు కూడా దక్కాయి. ఇందులో రావణుడి పాత్ర చేసిన స్వాతి అనే అమ్మాయికి కూడా ఉత్తమ బాలన నటిగా పురస్కారం దక్కింది. ఈ ప్రత్యేక చిత్రానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చిత్రంలోని తారక్ ఫొటోలను అభిమానులు వైరల్ చేస్తున్నారు.