పూరి జగన్నాథ్ గురించి మెగాస్టార్ చిరంజీవి శనివారం ఉదయం వేసిన ట్వీట్ వైరల్ అయింది. తాను కథానాయకుడిగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో పూరి జగన్నాథ్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయాన్ని వెల్లడిస్తూ, పూరితో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘నర్సీపట్నం నుంచి ఓకుర్రాడు వెండితెరపైన నటుడిగా వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా. అందుకే Introducing my puri jagan in a special role, from the sets of Godfather’’ అని చిరు పేర్కొన్నాడు.
చిరు ఈ ట్వీట్ అలా వేశారో లేదో.. ఇలా వైరల్ అయిపోయింది. ‘గాడ్ ఫాదర్’లో పూరి నటిస్తున్న విషయం ఇంతకుముందే చూచాయిగా వెల్లడైంది. ఇప్పుడు చిరునే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ చిత్రంలో పూరిది ఒక జర్నలిస్టు పాత్రగా చెబుతున్నారు. పూరి ఇంతకుముందే ‘ఏమాయ చేసావె’ సహా కొన్ని సినిమాల్లో క్యామియో తరహా పాత్రలు చేశారు.
ఐతే వాటితో పోలిస్తే ఇందులో పూరి రోల్ నిడివి కాస్త ఎక్కువే ఉంటుందని అంటున్నారు. ఐతే నటుడవ్వాలనే పూరి కల గురించి చిరు బాగానే చెప్పారు. పూర్తి స్థాయి నటుడిగా పూరిని పరిచయం చేస్తుండటం సంతోషమే. కానీ పూరీకి ఇంతకుమించిన కల ఒకటి ఉంది. అదే.. చిరంజీవిని డైరెక్ట్ చేయాలని. గత రెండు దశాబ్దాల్లో టాలీవుడ్లో పీక్స్ చూసిన దర్శకుల్లో పూరి ఒకరు. చిరును డైరెక్ట్ చేయడానికి ఆయన అన్ని విధాలుగా అర్హుడు. కాకపోతే పోకిరి, దేశముదురు లాంటి చిత్రాలతో పూరి కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలో చిరు సినిమాలకు దూరమవ్వడం ఆయన దురదృష్టం.
చిరు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్నపుడు ‘ఆటో జానీ’ అనే కథతో ఆయన పునరాగమన చిత్రాన్ని తనే డైరెక్ట్ చేయడానికి పూరి గట్టిగానే ప్రయత్నించాడు. కానీ ఆ కథలో సెకండాఫ్ నచ్చక చిరు ఓకే చెప్పలేదు. తర్వాత ‘ఖైదీ నంబర్ 150’తో రీఎంట్రీ ఇచ్చి వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. పూరి ఒకప్పటంత ఊపులో లేకపోయినా.. బాబీ, మెహర్ రమేష్ లాంటి దర్శకులతో చిరు పని చేస్తున్నపుడు పూరితో సినిమా చేయడంలో ఇబ్బందేముంది? మరి పూరి ఈ కలను కూడా మెగాస్టార్ నెరవేరుస్తాడేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates