రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల లైనప్ ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉంటోంది. అసలు పింక్ రీమేక్‌తో పవన్ రీఎంట్రీ ఇస్తాడనే ఎవరూ అనుకోలేదు. ఆ తర్వాత హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సినిమాలను ఓకే చేసిన పవన్.. మధ్యలో భీమ్లా నాయక్ సినిమాను లైన్లోకి తెచ్చి దాన్నే ముందు పూర్తి చేసి రిలీజ్ చేయించాడు.
ఆ తర్వాతైనా హరిహర వీరమల్లును పూర్తి చేసి భవదీయుడు భగత్ సినిమా సినిమాను మొదలుపెడతాడని అనుకుంటుంటే.. మధ్యలో వినోదియ సిత్తం అనే తమిళ మూవీ రీమేక్ తెరపైకి వచ్చినట్లు వార్తలొచ్చాయి. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తూ తనే డైరెక్ట్ చేసిన మూవీ ఇది. త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్టును రీరైట్ చేశాడని, సముద్రఖనినే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తాడని.. పవన్‌తో పాటు సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలు పోషిస్తారని.. మార్చి చివరి వారంలో షూటింగ్ మొదలని.. పవన్ ఈ చిత్రం కోసం 20 రోజుల డేట్లు కూడా కేటాయించాడని కొన్ని వారాల కిందట జోరుగా ప్రచారం జరిగింది. ఐతే మార్చి చివరి వారం వచ్చింది వెళ్లింది.
ఇప్పుడీ సినిమా ఊసే వినిపించడం లేదు. మీడియా, సోషల్ మీడియాలోనూ దీని గురించి చర్చే లేదు. పైగా పవన్ ఏమో సిన్సియర్‌గా హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రిపేరవుతున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ త్వరలో మొదలుపెట్టడానికి పచ్చజెండా కూడా ఊపినట్లు తెలుస్తోంది.
వినోదియ సిత్తం రీమేక్ విషయంలో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం.. ఎన్నాళ్లీ రీమేక్‌లు అన్న ప్రశ్న తలెత్తుతుండటం.. ఇంకో సినిమా మధ్యలోకి తెస్తే హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలు మరింత ఆలస్యమై తనకు రాజకీయ పరంగా కూడా ఇబ్బంది తలెత్తేలా ఉండటంతో పవన్ ఆ రీమేక్ విషయంలో వెనక్కి తగ్గాడేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates