అంత‌న్నాడింత‌న్నాడు.. చివ‌రికి చూస్తే

బాలీవుడ్లో జాన్ అబ్ర‌హాం కాస్త పేరున్న హీరోనే. యాక్ష‌న్ హీరోగా మంచి గుర్తింపున్న అత‌ను ధూమ్ స‌హా కొన్ని ఘ‌న‌విజ‌యాల‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అత‌ను ఎటాక్ అనే సినిమా చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిందీ చిత్రం. ల‌క్ష్య‌రాజ్ ఆనంద్ రూపొందించిన ఈ చిత్రంలో జాన్ స‌ర‌స‌న జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించారు.

ఈ చిత్ర ట్రైల‌ర్ యాక్ష‌న్ ప్రియుల‌ను బాగానే ఆక‌ట్టుకుంది. హిందీ మార్కెట్లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌భంజ‌నం సాగుతున్న‌ప్ప‌టికీ ఈ చిత్రాన్ని ధైర్యంగా ఏప్రిల్ 1న రిలీజ్ చేశారు. విడుద‌ల ముంగిట జాన్ ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హాట్ కామెంట్స్ చేశాడు. తెలుగు సినిమాల్లో న‌టిస్తారా అని అడిగితే.. ఇక్క‌డ మార్కెట్ పెంచుకోవ‌డం కోసం తాను తెలుగు సినిమాల్లో సెకండ్ హీరోగా న‌టించ‌న‌ని, అలాగే బాలీవుడ్ ఎప్పుడూ నంబ‌ర్ వ‌న్నే అని, ఏ ఇండ‌స్ట్రీకీ తీసిపోద‌ని అత‌ను వ్యాఖ్యానించాడు. 

తెలుగు సినిమాల్లో న‌టించ‌నంటే పోయేది కానీ.. బాలీవుడ్డే నంబ‌ర్ వ‌న్ అంటూ వేరే ఇండ‌స్ట్రీల‌ను తేలిక చేసి మాట్లాడ‌టం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఐతే ఇప్పుడా కామెంట్ల దెబ్బ‌కు విప‌రీతంగా ట్రోల్ అవుతున్నాడు జాన్. అత‌డి సినిమా ఎటాక్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల‌ప‌డ‌ట‌మే అందుక్కార‌ణం. తొలి రోజు దేశ‌వ్యాప్తంగా రూ.3 కోట్ల నెట్ వ‌సూళ్లు మాత్ర‌మే రాబ‌ట్టింది ఎటాక్.

అదే స‌మ‌యంలో విడుద‌లై వారం దాటిన ఆర్ఆర్ఆర్ సినిమా హిందీ మార్కెట్లో శుక్ర‌వారం ప‌ది కోట్ల‌కు పైగానే నెట్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. ఒక కొత్త హిందీ సినిమా.. ముందు వారం వ‌చ్చిన అనువాదం చిత్రం క‌లెక్ష‌న్ల‌లో మూడో వంతు కూడా రాబ‌ట్ట‌లేదంటే.. బాలీవుడ్ ఎలా నంబ‌ర్ వ‌న్ అవుతుంది? ఈ పాయింట్ ప‌ట్టుకుని జాన్ అబ్ర‌హాంను విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు తెలుగు జ‌నాలు. సౌత్ నుంచి మ‌రింత మంది నెటిజ‌న్లు వాళ్ల‌కు తోడై జాన్ గాలి తీస్తున్నారు ట్విట్ట‌ర్లో.