ఫ్లాప్ సినిమాలూ కేరాఫ్ ఓటీటీ

క‌రోనా కాలంలో ఓటీటీనే పెద్ద దిక్కు అని మ‌రోవైపు.. భారీగా చ‌ర్చ న‌డుస్తోంది. థియేట‌ర్లు మూసేసిన ఈ త‌రుణంలో, మ‌ళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలియ‌ని సందిగ్థంలో ఓటీటీ ప్ర‌ధాన ప్ర‌త్యామ్నాయంగా మారింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

థియేట‌ర్లు తెరిచే వ‌ర‌కూ ఆగ‌లేం అనుకున్న‌వాళ్లు, ఒక‌వేళ థియేట‌ర్లు తెర‌చినా, ఆ కంపిటీష‌న్లో థియేట‌ర్ల‌ను లాక్కోలేమ‌ని భావించిన వాళ్లూ ఓటీటీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు మ‌రో వ‌ర్గం కూడా త‌యారైంది.

ఈ సినిమా థియేట‌ర్లో వ‌స్తే ఫ్లాప్ అయిపోతుంద‌న్న భ‌యం ఉన్న‌వాళ్లు సైతం ఓటీటీకి జై కొడుతున్నారు. అందుక‌నేనేమో.. ఓటీటీలో వ‌రుస‌గా ఫ్లాప్ సినిమాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ఈ ఓటీటీకాలంలో క‌నీసం ప‌ది సినిమాలు వివిధ ఓటీటీ వేదిక‌ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వాటిలో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా ఇది థియేట‌ర్లో చూసుంటే ఎంత బాగుండేదో అని అనుకున్న పాపాన పోలేదు. పైగా ఓటీటీకే ఎక్కువ‌ అన్న ఫీలింగ్ తీసుకొచ్చాయి. ఆరేడు హిందీ సినిమాలు విడుద‌లైనా… ఒక్క‌టీ ఆడ‌లేదు. త‌మిళం ప‌రిస్థితీ అంతే. తెలుగు స‌రే స‌రి. ఇలాంటి మ‌రో రెండు మూడు ఫ్లాపులు ఎదురైతే చాలు, ఓటీటీ అంటే…ఫ్లాప్ సినిమాల ఫ్లాట్ ఫామ్ అనే ముద్ర ప‌డిపోతుంది.

అది సినిమాల ప‌రిస్థితిని మ‌రింత దిగ‌జార్చే ప్ర‌మాదం ఉంది. ఇప్పటి వ‌ర‌కూ క‌నీసం ఓటీటీలో అయినా సినిమాని విడుద‌ల చేసుకుని, కాస్త సొమ్ము చేసుకుందాం అనుకున్న నిర్మాత‌ల‌కు భంగ‌పాటు ఎదుర‌వుతుంది. వ‌రుస‌గా ఓటీటీలోకి వ‌చ్చిన సినిమాల‌న్నీ ఫ్లాప్ అయితే… ఓటీటీ వాళ్లు మాత్రం ఎందుకు కొంటారు? పైగా ఓటీటీ అన‌గానే ఓ ఫ్లాప్ ముద్ర ప‌డిపోతుంది. దాంతో జ‌నాల‌కూ ఇంట్ర‌స్ట్ పోతుంది.

ఇప్పుడు ఓటీటీవాళ్ల ముందున్న మార్గం.. మంచి సినిమాల్ని ఎంచుకోవ‌డ‌మే. ఓటీటీకి కూడా ఇప్పుడు ఓ హిట్టు అవ‌స‌రం. మంచి సినిమా ఓటీటీలో వ‌స్తే, దాని రేంజు ఎలా ఉంటుందో, స్పాన్ ఎంత పెరుగుతుందో చూడాల‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆశ‌. దుద‌రృష్టం ఏమిటంటే అలాంటి సినిమా ఒక్క‌టీ రావ‌డం లేదు.