అభిమానులను పరవశంలో ముంచెత్తిన చిరు

అభిమానులను పరవశంలో ముంచెత్తిన చిరుఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ చిరంజీవిని మించిన ఆల్‌రౌండ్ హీరో ఇంకొకరు లేరు. ముందు తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తమ తమ స్థాయిలో తిరుగులేని హీరోలుగా వెలుగొందారు కానీ.. చిరు స్థాయిలో వాళ్లు కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. నటనలో, హీరోయిజంలో వారికి దీటుగా నిలబడటమే కాదు.. డ్యాన్సులు, ఫైట్లలో వారిని దాటి ఎక్కడికో వెళ్లిపోయిన చిరు.. టాలీవుడ్లోనే కాదు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు.

తర్వాతి తరం హీరోలంతా ఆయన ప్రమాణాలను అందుకోవడానికే కష్టపడుతున్నారు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇంత పెద్ద స్టార్‌గా ఎదగడం.. మధ్యలో రాజకీయాల కోసం సినిమాలను వదిలేసే వరకు దాదాపు మూడు దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా వెలుగొందడం చిరుకే చెల్లింది. కేవలం కష్టంతోనే ఈ స్థాయిని అందుకున్న చిరు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. నటులే కాదు.. టెక్నీషియన్లు కూడా ఎంతోమంది ఇండస్ట్రీలోకి రావడానికి చిరునే ఆదర్శం.

ఆయన ఇలా ఇన్‌స్పైర్ చేసిన వాళ్లంతా తమ సినిమాల వేడుకల్లో చిరుపై తమకున్న భక్తిని చాటుకుంటూనే ఉంటారు. తాజాగా చిరు ముఖ్య అతిథిగా హాజరైన ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎటు చూసినా చిరు వీరాభిమానులే కనిపించారు. ఈ చిత్ర దర్శకుడు స్వరూప్, కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా, కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్, ఈ చిత్ర కథానాయకుడు సుహాస్, అలాగే మిడిల్ క్లాస్ మెలోడీస్‌తో దర్శకుడిగా మారిన వినోద్ అనంతోజు.. వీళ్లందరూ వేదిక మీద ఉండగా.. ఒక్కొక్కరి గురించి చిరు మాట్లాడుతుంటే వాళ్లంతా పరవశంలో మునిగిపోయారు.

చిరు స్వయంగా వీళ్లంతా తన అభిమానులని, తనను చూసి ఇన్‌స్పైర్ అయి ఇండస్ట్రీలోకి వచ్చారని చెబతుండటం తనకెంతో సంతోషంగా ఉందని చెబుతూ.. చివర్లో ‘‘వీళ్లంతా మన ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్’’ అని పేర్కొనడంతో ఆడిటోరియం హోరెత్తిపోయింది. ఈ వేడుకలో లేని ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి సైతం తన అభిమానే అని, తనను చూసి ఇన్‌స్పైర్ అయి ఇండస్ట్రీలోకి వచ్చాడని చెప్పినపుడు చాలా ఆనందించానని చిరు చెప్పడం వివేషం.