బీస్ట్ తో పోటీ.. కేజీఎఫ్ స్టార్ ఏం చెప్పాడంటే..

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ‘ఆర్ఆర్ఆర్’ ఆల్రెడీ థియేటర్లలోకి దిగేసింది. అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇక దీని తర్వాత అత్యంత ఆసక్తితో దేశమంతా ఎదురు చూస్తున్న ‘కేజీఎఫ్-2’ ఇంకో రెండు వారాల్లోనే థియేటర్లలోకి దిగబోతోంది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. దేశంలో అతి పెద్ద మార్కెట్లయిన హిందీ, తెలుగు రీజియన్లలో ఈ చిత్రానికి పోటీ లేదు. బాలీవుడ్, టాలీవుడ్ ‘కేజీఎఫ్-2’కు పోటీగా ఏ సినిమాను దించట్లేదు.

కానీ తమిళంలో మాత్రం విజయ్ సినిమా ‘బీస్ట్’తో దీనికి పోటీ తప్పట్లేదు. ‘కేజీఎఫ్-2’ మీద తమిళంలోనూ భారీ అంచనాలున్నప్పటికీ.. వేరే ప్రాంతాల్లో దీని వల్ల తమ చిత్రానికి ఇబ్బంది అవుతుందని తెలిసినప్పటికీ.. ‘బీస్ట్’ను ‘కేజీఎఫ్-2’తో పోటీకి దించేశారు. ఈ పోటీ వల్ల తమిళనాడు, కేరళల్లో ‘కేజీఎఫ్-2’కు కూడా ఇబ్బంది తప్పదు. చాలినన్ని థియేటర్లు దొరక్కపోవచ్చు. వసూళ్లపై ప్రభావం పడవచ్చు.

కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ‘కేజీఎఫ్-2’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా యశ్‌ను ఇదే ప్రశ్న అడిగాడు ఓ విలేకరి. దానికతను అదిరిపోయే సమాధానం చెప్పాడు. అందరూ కేజీఎఫ్-2 వెర్సస్ బీస్ట్ అని అంటున్నారని, కానీ తాను మాత్రం కేజీఎఫ్-2 అండ్ బీస్ట్ లాగా దీన్ని చూస్తానని యశ్ అన్నాడు.. యష్ మాట్లాడుతూ.. ఇదేమీ ఎన్నికలు కాదు, ఒక ఓటు ఉంటే దాన్ని ఏ ఒక్కరికో వెయ్యాలనే సమస్య తలెత్తదు. ప్రేక్షకుడికి నచ్చితే రెండు సినిమాలూ చూస్తాడు. ఒక సినిమా చూసి ఇది బాగుందని ఇంకొకరికి చెబితే.. అవతలి వ్యక్తి ఆ సినిమా బాగుందని ఇతడికి చెప్పొచ్చు. విజయ్ సార్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆయన చాలా పెద్ద స్టార్. ఎన్నో ఏళ్లుగా సినిమా కోసం ఎంతో చేశాడు. ఇంత ఫాలోయింగ్ సంపాదించున్నాడు. అలాంటి స్టార్‌ను మనందరం గౌరవించాలి.

మాది పాన్ ఇండియా సినిమా. మేం ఎనిమిది నెలల ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాం. అప్పుడు ఏ సినిమాతో పోటీ పడతామో తెలియదు. విజయ్ సార్ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయడం అవసరమని వాళ్లు అనుకున్నారు. కాబట్టి ఇక్కడ ఒకరితో ఒకరికి పోటీ లేదు. నేను బీస్ట్ సినిమా చూస్తాను. విజయ్ సార్ అభిమానులు కూడా నా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా.. అంటూ పరిణతితో సమాధానం చెప్పి అందరి మనసులూ గెలిచాడు యశ్.