వివేక్ అగ్నిహోత్రి… ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలోనే హాట్ టాపిక్

ది క‌శ్మీర్ ఫైల్స్.. ఇప్పుడు భార‌తీయ సినీ ప్రియుల చ‌ర్చ‌ల‌న్నీ ఈ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. హిందీలో త‌క్కువ బడ్జెట్లో వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాల మోత మోగిస్తోంది. పెద్ద‌గా అంచ‌నాల్లేకుండా విడుద‌లై.. అదిరిపోయే టాక్ తెచ్చుకుని వ‌సూళ్ల మోత మోగిస్తోంది. వారం వ్య‌వ‌ధిలోనే వంద కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ల‌తో ఈ చిత్రం దూసుకెళ్తోంది.

ఈ చిత్రానికి అంత‌కంత‌కూ స్క్రీన్లు, వ‌సూళ్లు పెరుగుతూ పోతున్నాయి ఈ చిత్రానికి. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్లోనే కాదు.. మొత్తం ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలోనే హాట్ టాపిక్ అయిపోయాడు. ఐతే క‌శ్మీర్ పండిట్ల‌పై అఘాయిత్యాల‌ను చూపించే క్ర‌మంలో ముస్లింల‌ను దోషులుగా చూపించ‌డంతో అత‌డిపై ఓ వ‌ర్గంలో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే అత‌డికి బెదిరింపులు కూడా వ‌స్తున్న‌ట్లు వెల్ల‌డైంది. ఈ మేర‌కు అతను పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం వివేక్‌కు వై కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇంత‌కుముందు బాలీవుడ్ న‌టి కంగనా ర‌నౌత్‌కు కూడా ఇలాగే కేంద్రం వై కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.

త‌మ‌కు అనుకూలంగా సినిమాలు తీసే, మాట్లాడే వారికి మోడీ స‌ర్కారు ఇలా అండ‌దండ‌లు అందిస్తోంద‌న్న చ‌ర్చ న‌డుస్తోందిప్పుడు. ఐతే కంగనా వ్య‌వహారంతో వివేక్ ఇష్యూను పోల్చ‌డానికి వీల్లేదు. క‌శ్మీర్ ఫైల్స్ వివాదాల‌తో కూడుకున్న సినిమా. ఓ వ‌ర్గం సినిమా పట్ల, సినిమా తీసిన వారిపై, ప్రమోట్ చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్ర‌భుత్వం ది క‌శ్మీర్ ఫైల్స్ దర్శక నిర్మాత అయిన వివేక్‌కు వై కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పించినట్లు తెలుస్తోంది