స్టార్ హీరోకు థియేటర్ల షాక్


మలయాళ ఫిలిం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన మమ్ముట్టి ఘన వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా వేగంగా ఎదిగాడు దుల్కర్ సల్మాన్. హీరోగా కంటే నటుడిగా అతను తనదైన ముద్ర వేశాడు. స్టార్ ఇమేజ్ కోసం వెంపర్లాడకుండా నటుడిగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ‘బెంగళూరు డేస్’ సహా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మాలీవుడ్ టాప్ హీరోల్లో అతనొకడు. దుల్కర్ సినిమాల కోసం ఎప్పుడూ ట్రేడ్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది.

గత ఏడాది కరోనా కష్టకాలంలోనూ అతడి ‘కురుప్’ సినిమా రిలీజై ఘనవిజయాన్నందుకుంది. దీని తర్వాత దుల్కర్ నుంచి రాబోతున్న ‘సెల్యూట్’ మీదా భారీ అంచనాలున్నాయి. జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేయగా.. కరోనా మూడో వేవ్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.

కొత్త రిలీజ్ డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైంలో చిత్ర బృందం షాకిచ్చింది. ‘సెల్యూట్’ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయబోవట్లేదని ప్రకటించింది. ‘సెల్యూట్’ను సోనీ లైవ్ ద్వారా నేరుగా డిజిటల్ రిలీజ్‌కు రెడీ చేశారు. ఈ మేరకు ప్రకటన వచ్చింది. దీంతో దుల్కర్ అభిమానుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. ఈ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఎగ్జిబిటర్లకూ ఈ నిర్ణయం రుచించలేదు. మోహన్ లాల్ సినిమా ఆరట్టు, మమ్మట్టి చిత్రం భీష్మపర్వం బాక్సాఫీస్‌కు మంచి ఊపు తెచ్చాయి. ఈ క్రమంలోనే ‘సెల్యూట్’ కూడా వస్తే బాక్సాఫీస్ మరింత పుంజుకుంటుందని ఆశించారు. కానీ భారీ అంచనాలున్న ఈ మాస్ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయబోవట్లేదని చెప్పడంతో ఎగ్జిబిటర్లకు మండిపోయింది.

ఇప్పటికే చాలా పెద్ద సినిమాలు ఓటీటీ బాట పట్టాయని, దీంతో థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకం అవుతోందని, ఇప్పుడు ‘సెల్యూట్’ లాంటి క్రేజీ మూవీని కూడా ఓటీటీ బాట పట్టిస్తే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయానికి నిరసనగా ఇకపై దుల్కర్ సినిమాలు వేటినీ థియేటర్లలో ప్రదర్శించబోమని, అన్ని సినిమాలూ ఓటీటీల్లో రిలీజ్ చేసుకోవాలని తేల్చి చెప్పేసింది కేరళ ఎగ్జిబిటర్ల సంఘం. ఈ నిరసన నేపథ్యంలో దుల్కర్ జోక్యం చేసుకుని ‘సెల్యూట్’ను థియేటర్లలోకి తెచ్చే ప్రయత్నమేదైనా చేస్తాడేమో చూడాలి.