ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోల విషయంలో ఎన్నో ఆశలు ఎట్టుకున్న రాధేశ్యామ్‌కు షాక్ తప్పలేదు. షోలు పెంచుకునే అవకాశం దక్కలేదు. ధరల పెంపు కూడా నామమాత్రమే. తమ సినిమాకు కూడా ఇలా అవుతుందేమో అని కంగారు పడి, అవసరమైన చోట తగ్గినా పర్వాలేదనుకుని ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య సోమవారం విజయవాడకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.
ఈ మీటింగ్ బాగా జరిగిందని, జగన్ బాగా రిసీవ్ చేసుకున్నారని, సినిమాకు అవసరమైందంతా చేస్తానని హామీ ఇచ్చారని మీడియాతో చెప్పాడు రాజమౌళి. ఇలా ప్రత్యేకంగా వెళ్లి సీఎంను కలిసి విన్నవించుకున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు కోరుకున్న ప్రయోజనమంతా దక్కుతుందని.. టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోల విషయంలో సమస్య ఉండదనే అంతా అనుకున్నారు.
కానీ అంతలోనే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని లైన్లోకి వచ్చేశారు. రాజమౌళి, దానయ్య.. సీఎంను కలవడంపై స్పందించారు. ఈ సమావేశంలో తాను పాల్గొనలేదని చెబుతూనే.. టికెట్ల రేట్లపై ప్రభుత్వం ఇచ్చిన జీవోపై సీఎంకు కృతజ్ఞతలు చెప్పడానికే రాజమౌళి, దానయ్య వచ్చారని ఆయన తేల్చేశారు. టికెట్ల ధరల విషయంలో ఒక్కొక్కరికి ఒకలా ఉండదని.. రాజమౌళి సినిమాకో రేటు, ఇంకో సినిమాకు మరో రేటు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
బెనిఫిట్ షోలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని, అలాగే ఐదో షో వేయాలనుకుంటే చిన్న సినిమాకు అవకాశం కల్పించాలని, నిబంధనలను అనుసరించే టికెట్ రేట్ల పెంపు ఉంటుందని నాని తేల్చేశారు. దీంతో దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించట్లేదు అన్నట్లుగా.. సీఎం హామీ ఇచ్చారంటుంటే నాని అందుకు ఛాన్సే లేదనడమేంటో జనాలకు అర్థం కావడం లేదు. మరి ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోలకు అవకాశముంటుందో లేదో చూడాలి.