పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా మిశ్రమ స్పందన వస్తోంది. 1960ల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుంది. క్లాసిక్ లవ్ స్టోరీ కావడం, కాస్త స్లోగా ఉండడంతో కొందరికి రుచించడం లేదు. కానీ ఓ వర్గం ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.
టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను వసూలు చేస్తుంది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.151 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని నిర్మాతలు స్వయంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి మంచి ఆఫర్లు వస్తున్నాయి.
డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకోవడానికి కొన్ని సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ భారీ ఒప్పందానికి ‘రాధేశ్యామ్’ హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. నిజానికి ఏ సినిమా అయినా.. థియేటర్ లో విడుదలైన నాలుగు వారాల తరువాతే ఓటీటీలో టెలికాస్ట్ చేస్తారు.
పెద్ద సినిమాలైతే ఇంకాస్త ఆలస్యం కూడా చేస్తున్నారు. అంటే ‘రాధేశ్యామ్’ సినిమాను ఏప్రిల్ 11 తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలి. కానీ ఏప్రిల్ 2న ఉగాది పండగ ఉండడంతో ఆ రోజు నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయాలని అమెజాన్ నిర్వాహకులు భావిస్తున్నారు. అప్పటికి ‘రాధేశ్యామ్’ రన్ కూడా పూర్తవుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ఉంది కాబట్టి ‘రాధేశ్యామ్’ అంతకాలం థియేటర్లో ఉండదేమో. మరి డిజిటల్ రిలీజ్ త్వరగా చేయడానికి నిర్మాతలు ఒప్పుకుంటారో లేదో చూడాలి!