రాధేశ్యామ్.. ఆ గుట్టు విప్పట్లేదే

చాన్నాళ్ల విరామం తర్వాత ఒక పాన్ ఇండియా సినిమా విడుదలకు సిద్ధమైంది. ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ నుంచి రాబోతున్న ఆ చిత్రమే.. రాధేశ్యామ్. ప్రభాస్ గత సినిమా ‘సాహో’ ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలం కాగా.. ఈసారి ఎంతో జాగ్రత్తగా ‘రాధేశ్యామ్’ సినిమా చేశాడు. ప్రభాస్ ఇమేజ్‌కు భిన్నంగా.. ఇది ఒక పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం కావడం విశేషం.

ఈ కారణంగానే ముందు దీనికి అనుకున్నంత బజ్ రాలేదు. కానీ రిలీజ్ ముంగిట పరిస్థితి మారింది. హైప్ పెరిగింది. ఈ సినిమాకు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఆ సంగతి అర్థమైపోతుంది. రిలీజ్ ముంగిట రిలీజ్ చేసిన ప్రోమోలు, ప్రభాస్ అండ్ టీం ప్రమోషన్లు బాగానే వర్కవుట్ అయినట్లున్నాయి. సినిమాలో విశేషాలకు కొదవ లేదని ఇటీవలి ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది.

ఐతే ఈ ప్రోమోలు చూస్తే కథ గురించి బాగానే ఐడియా వస్తోంది కానీ.. ముందు నుంచి నెలకొన్న ఒక సస్పెన్స్ మాత్రం ఎంతకీ వీడట్లేదు.రాధేశ్యామ్ అనే టైటిల్ ఈ చిత్రానికి ఎందుకు పెట్టారన్నది ఇప్పటిదాకా వెల్లడి కాలేదు. మామూలుగా టీజర్‌తోనే సినిమాకు ఫలానా టైటిల్ ఎందుకు పెట్టారన్నది అర్థమైపోతుంటుంది. కానీ ‘రాధేశ్యామ్’ నుంచి రెండు ట్రైలర్లు వచ్చాక కూడా టైటిల్ గురించి సస్పెన్స్ వీడలేదు. ముందేమో సినిమాలో హీరో పేరు శ్యామ్, హీరోయిన్ పేరు రాధ అయ్యుండొచ్చని అందుకే ఈ టైటిల్ పెట్టారని భావించారు. కానీ అది  నిజం కాదు. ఇందులో ప్రభాస్ పేరు విక్రమాదిత్య కాగా.. పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది.

ఈ చిత్రం పూర్వ జన్మల నేపథ్యంలో నడుస్తుందన్న ప్రచారం గతంలో జరిగింది. అదే నిజమైతే.. గత జన్మలో వీళ్ల పేర్లు శ్యామ్, రాధ అయ్యుండొచ్చని అనుకున్నారు. కానీ ట్రైలర్లలో ఇది పూర్వ జన్మల కథ అనే సంకేతాలేమీ కనిపించలేదు. ఒకవేళ ఫ్లాష్ బ్యాక్ ఏదైనా ఉండి.. అందులో పూర్వజన్మ కథను చూపిస్తారా.. దాన్ని ప్రస్తుతానికి దాచి పెట్టారా అన్నది తెలియదు. మొత్తంగా చూస్తే ‘రాధేశ్యామ్’ అనే టైటిల్ ఈ సినిమాకు ఎందుకు పెట్టారనే విషయంలో ఎవ్వరికీ ఇప్పటిదాకా క్లారిటీ లేదు. మరి దీని వెనుక కథేంటో చూడాలి.