ఇంకో మూడు వారాల్లోపే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్లలో ఇద్దరైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. వీరి అపూర్వ కలయికలో సినిమా రూపొందించిన రాజమౌళిని తటస్థ ప్రేక్షకులందరూ అభినందిస్తున్నారు. ఈ కలయికలో సినిమా చూడ్డం అందరికీ ఆనందమే కావాలి.
ఆ హీరోలు ఎలా అయితే భేషజాలు పక్కన పెట్టి.. రాజమౌళికి బెండ్ అయి ఇంకేమీ ఆలోచించకుండా ఈ సినిమా చేశారో.. అభిమానులు కూడా అంతే ఓపెన్ మైండ్‌తో ఉండి ఈ అరుదైన కలయికలో సినిమాను ఆస్వాదించడానికి సిద్ధపడాలి.
కానీ ఈ సినిమా పట్టాలెక్కినప్పటి నుంచి వాళ్లది ఒకటే గోల. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప.. ప్రోమోల్లో మా హీరో హైలైట్ అయ్యాడంటే మా హీరో హైలైట్ అయ్యాడు.. సినిమాలో కూడా మా వాడిదే పై చేయి అంటే మావాడిదే పైచేయి అని రెండు మూడేళ్ల నుంచి తెగ కొట్టేసుకుంటున్నారు సోషల్ మీడియాలో.
ఇప్పుడు రిలీజ్ ముంగిట కూడా ఈ గొడవ తప్పట్లేదు. ఓవర్సీస్లో ఈ సినిమాకు ప్రి సేల్స్ ఓ రేంజిలో జరుగుతున్నాయి. అక్కడ బాక్సాఫీస్‌ను షేక్ చేసే స్థాయిలో హాలీవుడ్ సినిమాలకు దీటుగా ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్లు సాధించబోతుండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు తెలుగు ప్రేక్షకులు అందరూ గర్వించాలి.
కానీ తారక్, చరణ్ అభిమానులు మాత్రం ఇది మానేసి ఇప్పుడు కూడా ‘క్రెడిట్’ కోసం కొట్టేసుకుంటున్నారు. ప్రి సేల్స్ ఇలా జరగడానికి తమ హీరో కారణమంటే తమ హీరో కారణమని గొప్పలు పోతున్నారు. ఒక ఎన్టీఆర్ అభిమాని ఎవరో ఒక్కడే 75 టికెట్లు కొన్నాడట. దాని మీద కూడా పెద్ద డిస్కషన్ నడుస్తోంది ఇప్పుడు.
ఇలా మీ హీరోకు ఎవరైనా చేశారా అని తారక్ అభిమానులు అనడం. ఫలానా ఏరియాలో రామ్ చరణ్ అభిమానులే ఎక్కువ టికెట్లు కొంటున్నారు. ప్రి సేల్స్‌లో తమ హీరో పేరు మీద తెగిన టికెట్లే ఎక్కువ అని చరణ్ అభిమానులు అనడం. దీంతో పాటుగా ప్రోమోల్లోని షాట్లు తీసి మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అని ఎప్పట్లాగే కొట్టుకోవడం ఇదీ వరస. వీళ్లు ఇంకెప్పటికి మారతారో మరి.