‘మీ టూ’ ఉద్యమం మొదలైన దగ్గర్నుంచి సినీ పరిశ్రమలో ఎన్నో లైంగిక వేధింపుల కేసులు బయటికి వచ్చాయి. అంతకుముందు గుట్టుగా ఉండిపోయిన చాలా విషయాలు తర్వాత బహిర్గతం అవడం మొదలైంది. ఈ క్రమంలో నిజంగా వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ధైర్యంగా గొంతు విప్పడం మొదలైంది.
అదే సమయంలో పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తూ.. ఉన్నట్లుండి విభేదాలు తలెత్తడం వల్ల ఆ బంధంలో ఉన్న మహిళ.. తన భాగస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, లైంగిక వేధంపులు, అత్యాచార ఆరోపణలతో కేసులు పెట్టడం.. ఇలాంటి ఉదంతాలు చాలా చూశాం.
ఇప్పుడు కేరళలో కూడా ఇలాంటి కేసే ఒకటి బయటికి వచ్చింది. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన లిజు కృష్ణ అనే దర్శకుడిపై ఓ మహిళల రేప్ కేసు పెట్టింది. పోలీసులు అతణ్ని అరెస్టు చేసి జైల్లో పెట్టడం సంచలనం రేపింది.
లిజు కృష్ణ.. ‘పడవేట్టు’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం గమనార్హం. ఆ చిత్రంలో నివిన్ పౌలీ, మంజు వారియర్ లాంటి పెద్ద నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకత్వ కల నెరవేరుతున్న సమయంలో లిజు అనూహ్యంగా రేప్ కేసులో చిక్కుకుని అరెస్టయ్యాడు. ఈ చిత్ర బృందంలో పని చేస్తున్న అమ్మాయే అతడిపై కేసు పెట్టింది. ఆమెతో అతను కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఐతే తనను పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి అడగ్గా.. లిజు కృష్ణ తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. లిజు మీద రేప్ కేసు పెట్టింది. ఆ అమ్మాయి పేరును పోలీసులు బయట పెట్టలేదు. లిజు దర్శకత్వం వహిస్తున్న ‘పడవేట్టు’ సినిమా చిత్రీకరణ అర్ధంతరంగా ఆగిపోయింది. మరి ఈ కేసు ఎక్కడిదాకా వెళ్తుంది.. ఈ సినిమా పరిస్థితేంటి అన్నది అయోమయంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates