ఈ రోజుల్లో సెట్టింగ్స్ లేకుండా సినిమాలు తీసేవాళ్లు అరుదు. ఇంతకుముందులా ఔట్ డోర్స్‌కు వెళ్లి సినిమాలు తీయడం బాగా తగ్గిపోయింది. అందుకు పరిస్థితులు కూడా అంతగా సహకరించడం లేదు. అందుకే చాలా వరకు సెట్టింగ్స్ వేసి లాగించేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకు చాలా వరకు స్టూడియోల్లో, ప్రైవేటు ప్రాపర్టీస్‌లో సెట్టింగ్స్ వేసి ఏ డిస్టబెన్స్ లేకుండా ప్రశాంతంగా షూటింగ్ చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. పాటలు కూడా చాలా వరకు సెట్స్‌లోనే పూర్తవుతుంటాయి.
ఇక సినిమాకు భారీతనం తేవడం కోసం సెట్స్‌ను ఉపయోగించడమూ జరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో పల్లెటూళ్లు, పట్టణాలను కూడా సెట్స్ ద్వారా నిర్మించేస్తుండటం విశేషం. ‘బాహుబలి’ కోసం మాహిష్మతి అనే ఒక సామ్రాజ్యాన్నే సెట్స్ రూపంలో తీర్చిదిద్దారు. ఇక రంగస్థలం, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ లాంటి భారీ చిత్రాలకు ఇలా ఊర్లకు ఊర్లనే నిర్మించేశారు.
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రాధేశ్యామ్’ సినిమా కోసం కూడా భారీగానే సెట్స్ నిర్మాణం జరిగింది. ఇటలీలో ఒక షెడ్యూల్ చేసుకుని ఇండియాకు వచ్చాక కరోనా కారణంగా మళ్లీ అక్కడికి వెళ్లే అవకాశం లేకపోతే.. ఇటలీ నగరాన్ని తలపించేలా ఇక్కడే హైదరాబాద్‌లో సెట్స్ నిర్మించి వాటిలోనే మిగతా షూటింగ్ అంతా పూర్తి చేయడం విశేషం.
రేప్పొద్దున సినిమా చూసేవారికి కథ ఇటలీలో జరుగుతున్నట్లే అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. ఇందుకోసం ఎంత కష్టపడ్డారన్నది ఇటీవల రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోతోనే స్పష్టమైంది. నిజానికి మళ్లీ ఇటలీకి వెళ్లి షూట్ చేయాల్సిన సన్నివేశాల విషయంలో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నపుడు ప్రభాసే.. ఆ నగరాన్ని తలపించే సెట్స్ ఇక్కడే వేద్దామని ఐడియా ఇచ్చాడట. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. అంతే కాక ఈ సినిమా కోసం ఏకంగా 101 సెట్లు నిర్మించినట్లు రవీందర్ చెప్పడం విశేషం. ఎంత భారీ చిత్రం అయినా పదో ఇరవయ్యో ముప్ఫయ్యో సెట్స్ వేస్తారు కానీ.. మరీ సెట్స్ సంఖ్య సెంచరీ దాటేయడం మాత్రం అనూహ్యం. దీన్ని బట్టే ఈ సినిమా భారీతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.