ఇలా ఆలోచించే హీరోలెంద‌రు?

సినిమాల ప్ర‌భావం జ‌నాల మీద ఉండ‌ద‌నుకుంటే పొర‌బాటే. సినిమాలు చూసి పూర్తిగా చెడిపోవ‌డం లేదా ఒక్క‌సారిగా మంచివారైపోవ‌డం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు కానీ.. ఎంతో కొంత ప్ర‌భావితం కావ‌డం మాత్రం జ‌రుగుతుంటుంది. అందుకే సినిమాలు తీసేవాళ్లకు సామాజిక బాధ్య‌త ఉండాల‌ని.. ఎంతో కొంత మంచి చెప్పే ప్ర‌య‌త్నం చేయాల‌ని.. మంచి క‌థ‌లు ఎంచుకోవాల‌ని అంటుంటారు. ఐతే దీన్ని అంద‌రు హీరోలూ పాటించ‌రు.

త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య మాత్రం ఎప్పుడూ ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకునే అడుగులు వేస్తుంటాడు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తూనే.. సొంత బేన‌ర్లో గొప్ప క‌థ‌ల‌తో ప్ర‌యాణం చేస్తుంటాడు. మేము, ఆకాశం నీ హ‌ద్దురా, జై భీమ్ లాంటి చిత్రాలు ఈ కోవ‌లోకే వ‌స్తాయి. ఈ చిత్రాల‌న్నింట్లో గొప్ప సందేశం ఉంది. ఆలోచింప‌జేసే, క‌దిలించే విష‌యాలున్నాయి. ఇప్పుడ‌త‌ను ఈటి అనే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

ఐతే త‌ర‌చుగా తాను సందేశాత్మ‌క చిత్రాలు చేయ‌డం గురించి సూర్య మాట్లాడుతూ.. నేను న‌టించిన సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్ సినిమా చూసి ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ సిగ‌రెట్ తాగ‌డం ఆపేశాడ‌ట‌. కేవ‌లం వినోదం కోస‌మే కాకుండా ఇలాంటి మార్పు కోసం కూడా సినిమాలు చేయాలి. నేను ప్రేక్ష‌కులను ఆలోచింప‌జేసేలా సినిమాలు చేయ‌డం నా బాధ్య‌త‌గా భావిస్తా. ఆకాశం నీ హ‌ద్దురా, జై భీమ్ సినిమాలు ఎంచుకున్న‌పుడు నా స్టైల్ క‌థ‌లు ఇవి కావ‌ని చాలామంది అన్నారు. ఆకాశం నీ హ‌ద్దురా చిత్రంలో పెళ్లాంతో చెంప‌దెబ్బ తింటాను. ఆమెని డ‌బ్బు అడుగుతాను. జై భీమ్‌లో తొలి అర‌గంట నా పాత్ర ఉండ‌దు. హీరోయిజం గురించి ఆలోచిస్తే ఇలాంటి సినిమాలు చేయ‌లేం. దాని గురించి ఆలోచించ‌కుండా, మంచి చెప్పాల‌న్న ఉద్దేశంతో ఆ రెండు చిత్రాలు చేశాను. అందుకే అవి నాకు అంత గౌర‌వాన్ని తెచ్చిపెట్టాయి. సామాజిక మార్పును తీసుకొచ్చిన చిత్రాలివి. అవి నాకెంతో ఆత్మ‌సంతృప్తినిచ్చాయి అని వివ‌రించాడు సూర్య‌.

ఈ సినిమాలు, సూర్య ఆలోచ‌న‌లు గ‌మ‌నిస్తే ఈ రోజుల్లో త‌న‌లా ఆలోచించే హీరోలు చాలా అరుద‌న‌డంలో సందేహం లేదు.