రాధేశ్యామ్.. నెగెటివిటీ అంతా పోయినట్లేనా?

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాల స్థాయే వేరుగా ఉంటోంది. ఆ సినిమా తర్వాత వచ్చిన ‘సాహో’కు ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే. ‘బాహుబలి’కి దీటుగా బజ్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఓపెనింగ్స్‌లోనూ అదరగొట్టింది. ఐతే ఈ చిత్రానికి పూర్తిగా నెగెటివ్ టాక్ రావడంతో తర్వాత సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయింది. మిగతా అన్ని చోట్లా సినిమా ఫెయిల్యూర్ అయినప్పటికీ.. హిందీ మార్కెట్లో మాత్రం ఆ చిత్రం బయ్యర్లకు లాభాలు అందించడం విశేషం.

అందుకు ఆ సినిమాలోని హీరో ఎలివేషన్లు, యాక్షన్ ముఖ్య కారణం. కానీ ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ పూర్తి స్థాయి ప్రేమకథ కావడం.. ఇందులో యాక్షన్‌కు అవకాశం లేకపోవడంతో ముందు నుంచే దీనికి హైప్ తక్కువగా ఉంది. ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్-యాక్షన్ హీరోగా ఎదిగిన ప్రభాస్‌ను ఒక ప్రేమకథలో చూడటం మెజారిటీ ప్రేక్షకులకు నచ్చలేదన్న సంకేతాలే కనిపించాయి.

దీనికి తోడు ‘రాధేశ్యామ్’ ప్రోమోలన్నీ క్లాస్‌గా ఉండటం, రెండు నెలల కిందట రిలీజ్ చేసిన ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడం కూడా మైనస్ అయింది. మొత్తంగా చూస్తే జనవరి 14న ‘రాధేశ్యామ్’ను రిలీజ్‌కు రెడీ చేసినపుడు.. విడుదల ముంగిట అనుకున్నంత పాజిటివ్ బజ్ కనిపించలేదు. అందులోనూ దానికి వారం ముందే ‘ఆర్ఆర్ఆర్’ రావడంతో అంతా దాని గురించే చర్చించుకుంటూ ఉన్నారు. ‘రాధేశ్యామ్’ గురించి మాట్లాడేవారే కరవయ్యారు.

ఆ స్థితిలో సినిమా హిట్టయితే ఆశ్చర్యపోవాలేమో అనిపించింది అందరికీ.ఐతే కరోనా కారణంగా ‘రాధేశ్యామ్’ వాయిదా పడటం దీనికి కలిసొచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ అడ్డంగా లేదు. అది రెండు వారాలు వెనుక వస్తోంది. దీంతో కరోనా థర్డ్ వేవ్ తర్వాత ఇండియన్ బాక్సాఫీస్‌లో రాబోతున్న అతి పెద్ద చిత్రంగా ఫోకస్ అంతా ‘రాధేశ్యామ్’ మీదికి మళ్లింది. దీనికి తోడు ఇటీవల రిలీజ్ చేసిన కొత్త ట్రైలర్ ఆకట్టుకునేలా సాగింది.

ముందు రిలీజ్ చేసిన ట్రైలర్ లాగా ఇందులో సాగతీత లేదు. క్రిస్ప్‌గా, ఆసక్తికరంగా, క్యూరియాసిటీ పెంచేలా ట్రైలర్ కట్ చేయడంతో పాజిటివ్ బజ్ వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సినిమా కోసం ఇంత కష్టపడ్డారా.. ఇందులో ఇంత భారీతనం ఉందా అన్న చర్చ నడుస్తోంది. కొంచెం ఆలస్యమైనప్పటికీ.. చిత్ర బృందం కూడా ప్రమోషన్ల జోరు పెంచింది. దీంతో సినిమా మీద ఇంతకుముందున్న నెగెటివిటీ అంతా పక్కకు వెళ్లిపోయి.. పాజిటివ్ బజ్ కనిపిస్తోంది.