గ్రేట్ డైరెక్టర్.. తమ్ముడి కష్టం కనిపించలేదా?
‘దబంగ్’ లాంటి ఆల్ టైం హిట్ సినిమాను అందించిన దర్శకుడు అభినవ్ కశ్యప్. ఐతే తొలి సినిమాతోనే అంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న అభినవ్.. ఆ తర్వాత ఒక్క హిట్టు సినిమా కూడా తీయలేకపోయాడు. అతడి కెరీర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది. ఐతే ఇందుకు కారణం సల్మాన్ ఖాన్ కుటుంబమే అంటూ అతను సంచలన ఆరోపణలు చేశాడు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్లో బడా బాబుల మాఫియా ఎలా ఉంటుందో వివరిస్తూ అతను ఒక లెంగ్తీ ఫేస్ బుక్ పోస్టు పెట్టాడు. తమ సంస్థలో ‘దబంగ్’ సీక్వెల్ చేయనందుకు గాను సల్మాన్ ఖాన్, అతడి సోదరులు తనను ఎలా వేధించుకు తిన్నారో అందులో అతను కూలంకషంగా వివరించాడు. తనకు వేరే సినిమాలు దక్కకుండా కుట్రలు పన్నారని.. రెండు సంస్థలకు అడ్వాన్సులు వెనక్కిప్పించారని.. ఒక సినిమా విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేశారని.. పదేళ్లుగా వారితో పోరాడుతున్నానని అభివన్ గోడు వెల్లబోసుకున్నాడు.
వీరి ధాటికి తాను కూడా డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాల్సిన వాడినే అని అభినవ్ అన్నాడు. ఐతే అభినవ్ ఏమీ బ్యాగ్రౌండ్ లేని వాడు కాదు. అతడి అన్న అనురాగ్ కశ్యప్ గొప్ప దర్శకుడు. అతడికి బాలీవుడ్లో మంచి పలుకుబడి ఉంది. మరి తమ్ముడు ఇంతగా కష్టపడుతుంటే.. వేధింపులు ఎదుర్కొంటూ ఉంటే అతను ఏమాత్రం సాయం చేయలేకపోయాడా.. సల్మాన్ ఖాన్ కుటుంబాన్ని నిలదీయలేకపోయాడా.. తమ్ముణ్ని కాపాడలేకపోయాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆదర్శ భావాలున్న వాడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ సీఏఏ సహా అనేక అంశాల విషయంలో మోడీ సర్కారుతో పోరాడుతున్న అనురాగ్.. సొంత తమ్ముడికి జరుగుతున్న అన్యాయంపై గళం విప్పకపోవడం ఏంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనురాగ్ హిపోక్రాట్ అంటూ అతడిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
ఐతే ఈ విషయమై అనురాగ్ వివరణ ఇచ్చాడు. తన వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దంటూ రెండేళ్ల కిందట అభినవ్ తనకు స్పష్టంగా చెప్పాడని.. దీంతో తాను అతడికి దూరంగా ఉంటున్నానని. మీడియా వాళ్లు ఈ ఇష్యూలో తన వివరణ కోసం అడగొద్దని అతను ఒక ట్వీట్ వేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates