ఆ హీరో న‌మ్మితే అంతే..

హిట్ కాంబినేష‌న్లు రిపీట్ కావ‌డం ప్ర‌తి ఇండస్ట్రీలోనూ జ‌రిగేదే. ఒక హీరోతో ఒక ద‌ర్శ‌కుడు హిట్ కొడితే.. మ‌ళ్లీ కొంత కాలానికి ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తుంటారు. ఐతే త‌మిళంలో అజిత్ రూటే వేరు. అత‌డికి ఓ ద‌ర్శ‌కుడిపై గురి కుదిరితే.. గ్యాప్ లేకుండా వ‌రుస‌బెట్టి సినిమాలు చేసేస్తుంటాడు. మ‌ధ్య‌లో ఏదైనా సినిమా తేడా కొట్టినా కూడా అత‌డి ఆలోచ‌న మార‌దు. ఇంత‌కుముందు విష్ణువ‌ర్ధ‌న్ (తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పంజా తీశాడు) అనే ద‌ర్శ‌కుడితో తొలిసారి బిల్లా మూవీకి జ‌ట్టు క‌ట్టాడు అజిత్.

ఆ సినిమా హిట్ట‌వ‌డంతో వెంట‌నే ఆరంభం అని మ‌రో సినిమా చేశాడు. వీరి క‌ల‌యిక‌లో బిల్లా-2 కూడా రావాల్సింది. కానీ విష్ణు వేరే సినిమాతో బిజీగా ఉండ‌టంతో ఆ చిత్రాన్ని మ‌రో ద‌ర్శ‌కుడితో చేశాడు. ఇక తెలుగులో శౌర్యం అనే సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన శివ‌తో అజిత్ అనుకోకుండా క‌నెక్ట‌య్యాడు. వీరి క‌ల‌యిక‌లో మొద‌ట వీరం అనే సినిమా వ‌చ్చింది. అది హిట్ట‌యింది. ఇక అంతే.. వ‌రుస‌బెట్టి అత‌డితో సినిమాలు చేసుకుంటూ పోయాడు. వీరి క‌ల‌యిక‌లో వ‌రుస‌గా వేదాళం, వివేకం, విశ్వాసం సినిమాలు వ‌చ్చాయి.

మ‌ధ్య‌లో వివేకం సినిమా డిజాస్ట‌ర్ అయి.. అభిమానులు ఈ ద‌ర్శ‌కుడితో ఇంకో సినిమా వ‌ద్దు, ఆపేయ్ అన్నా అజిత్ ఆగ‌లేదు. మ‌ళ్లీ అత‌డితో విశ్వాసం సినిమా చేశాడు. అది బ్లాక్‌బ‌స్ట‌ర్ అయింది. అంత‌టితో అజిత్, శివ బంధానికి తెర‌ప‌డింది. ఆ త‌ర్వాత హెచ్‌.వినోద్‌తో జ‌ట్టు క‌ట్టాడు అజిత్. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి సినిమా నీర్కొండ‌పార్వై ఓ మోస్త‌రుగా ఆడింది.

అది పింక్ మూవీకి రీమేక్. దీని త‌ర్వాత అజిత్.. వినోద్‌కు స్ట్రెయిట్ సినిమా చేసే ఛాన్సిచ్చాడు. అదే.. వ‌లిమై. ఈ సినిమా ఇటీవ‌లే విడుద‌లై మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకుంది. అజిత్ అభిమానులు నిరాశ చెందారు. కానీ వాళ్లు వ‌ద్దంటున్నా వినోద్‌తో ఇంకో సినిమాను ప‌ట్టాలెక్కించేస్తున్నాడు అజిత్. ఆల్రెడీ ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంటూ ఈ సినిమాకు రెడీ అయిపోయాడు. ఇందుకోసం కొత్త లుక్‌లోకి కూడా మారాడు. ఇంకొన్ని రోజుల్లోనే ఈ సినిమా మొద‌లు కాబోతోంది. ఈ రోజుల్లో ఇలా ఒక ద‌ర్శ‌కుడిపై గురి కుదిరితే గ్యాప్ లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేసే హీరో అజిత్ మాత్ర‌మే అని చెప్పాలి.