స్పీడు పెంచాలి ప్రభాస్..

‘బాహుబలి’ తర్వాత స్పీడు పెంచాలని ప్రభాస్ ఎంతగా ప్రయత్నించినా.. ఆలస్యం తప్పట్లేదు. ‘సాహో’ అనుకున్నదానికంటే ఆలస్యమైంది. అది భారీ యాక్షన్ మూవీ కాబట్టి ఆలస్యం కావడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రేమకథా చిత్రం అయిన ‘రాధేశ్యామ్’ కూడా ఇంతే ఆలస్యం కావడం అభిమానులకు రుచించలేదు. ఇందులోనూ కొంత భారీతనం ఉన్నప్పటికీ.. మరీ ఇంత లేటవ్వాల్సిన సినిమా అయితే కాదు. అందుకు మేకింగ్‌లో జరిగిన ఆలస్యానికి తోడు కరోనా పరిస్థితులు కూడా కారణమయ్యాయి.

సంక్రాంతి కానుకగా జనవరి 14న రావాల్సిన ఈ సినిమాను థర్డ్ వేవ్ కారణంగా మరోసారి వాయిదా వేయక తప్పలేదు. మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఈసారి ఏ అడ్డంకీ లేనట్లే. సినిమా ఆ రోజు పక్కాగా విడుదల కానున్నట్లే. కానీ ఇంకో పది రోజుల్లోపే సినిమా విడుదల కావాల్సి ఉండగా.. మామూలుగా ప్రభాస్ సినిమాలకు ఉండే హైప్ అయితే కనిపించడం లేదు.జనవరి రిలీజ్ తప్పాక.. ‘రాధేశ్యామ్’ అనే కాదు.. వాయిదా పడ్డ అన్ని సినిమాలకూ కొంత హైప్ తగ్గిన మాట వాస్తవం.

మళ్లీ మళ్లీ వాయిదా పడటం వల్ల ఆసక్తి కొంత తగ్గింది. ఈసారి రిలీజ్ పక్కా అని తెలిసినా.. జనాలు అందుకు ప్రిపేర్డ్‌గా లేనట్లే కనిపిస్తోంది. ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న రాబోతున్నా.. ఇది నిజం అని నమ్మి జనాలు రిలీజ్ యుఫోరియాలోకి రావడానికి కొంత సమయం పట్టింది. ఐతే రిలీజ్ ముంగిట రావాల్సిన హైప్ అంతా వచ్చేసిందా చిత్రానికి. ‘రాధేశ్యామ్’ విషయంలోనూ ఇదే సమస్య కనిపిస్తోంది. ఇంకో 9 రోజుల్లోనే సినిమా రావాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభాస్ అభిమానులు మానసికంగా సిద్ధమై లేనట్లు కనిపిస్తోంది.

ఈ పాన్ ఇండియా సినిమాకు ఇది మంచి సంకేతం కాదు. జనాలను ప్రిపేర్ చేయడానికి తాజాగా రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేశారు. అది ముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌తో పోలిస్తే మెరుగ్గా ఉంది. ఇంతటితో ఆగకుండా ప్రభాస్ నేరుగా రంగంలోకి దిగి గట్టిగా సినిమాను ప్రమోట్ చేయాల్సిన అవసరముంది. ఇంతకుముందులా అతను రిజర్వ్‌గా ఉంటూ, మొక్కుబడిగా ప్రమోషన్లు చేస్తే నడవదు. ఈ సినిమాకు క్రౌడ్ పుల్లర్ అతనే కాబట్టి గ్రౌండ్లోకి దిగి దేశవ్యాప్తంగా బాగా తిరిగి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లి రిలీజ్ టైంకి హైప్ పెంచాల్సిన అవసరముంది.