మూడేళ్ల కిందట తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన పార్టీ సాధించిన ఒక్కటి మాత్రమే. పైగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. ఈ విషయంలో ప్రత్యర్థులు ఆయన్ని తరచుగా హేళన చేస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో వైసీపీ, టీడీపీ వర్గీయులు.. పవన్ ఓటమి గురించి పంచులేస్తూ జనసైనికులను ఇబ్బంది పెడుతుంటారు. పవన్‌కు ఈ ఓటములు ఎంత బాధ కలిగించినా.. కొన్నిసార్లు ఆవేదన స్వరం వినిపించినా.. ఎక్కువ సందర్భాల్లో తాను ఓటమికి భయపడనని, పారిపోననే చెబుతుంటాడు.
ఎన్నోసార్లు రాజకీయ వేదికల్లో ఈ విషయాన్ని నొక్కి వక్కాణించాడు. అలాగే సినిమాల ద్వారా కూడా తన ఉద్దేశాన్ని బలంగా చాటిచెప్పే ప్రయత్నం చేస్తుండటం విశేషం. గత ఏడాది విడుదలైన ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ ఐడియాలజీకి తగ్గట్లే కొన్ని పొలిటికల్ డైలాగులు పెట్టారు. జనం తనను వద్దనుకున్నా తాను వాళ్లను వదులుకోనని.. తన కనెక్షన్ వాళ్లతోనే అని.. వారితోనే ఉంటానని ‘వకీల్ సాబ్’లో పవన్ డైలాగులు పేల్చడం గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడు ‘భీమ్లా నాయక్’లోనూ ఈ ఒరవడిని కొనసాగించాడు పవన్.ఇందులో పోలీస్ ఉద్యోగం ఊడి సామాన్యుడిగా మారాక బస్సులో ప్రయాణిస్తున్న పవన్‌ను రానా ఉడికించే ప్రయత్నం చేస్తాడు. అవమానించాలని చూస్తాడు. దానికి పవన్ ఏమాత్రం తొణక్కుండా దీటుగా బదులిస్తాడు. ‘‘నన్ను తొక్కేయ్ లేస్తా.. పీకేయ్ మళ్లీ మొలుస్తా.. తోసేయ్ మళ్లీ వస్తా’’ అని చెబుతాడు.
అలాగే యుద్ధంలో ఓడిపోతామని భయం లేని వాడు ఎవ్వరికీ తలవంచడని కూడా ఇంకో మాట అంటాడు. ఎన్నికల్లో ఓడిపోయానని తనను హేళన చేసే వాళ్లకు పవన్ సమాధానంగా ఈ డైలాగ్‌ను చెప్పొచ్చు. అలాగే ఈ చిత్రంలో కూడా జనాలకు అండగా నిలిచే, వాళ్ల హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా పవన్ కనిపించడం ఇమేజ్‌ను పెంచే ప్రయత్నమే. మొత్తానికి తన సినిమాలను రాజకీయ ఇమేజ్ కోసం పవన్ బాగానే ఉపయోగించుకుంటున్నాడు. అలాగని ఎక్కడా మోతాదు పెరగకుండా చూసుకుంటుండటం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates