ఆ రీమేక్‌లో దంగల్‌ బ్యూటీ

మలయాళ సినిమాలపై మనకే కాదు.. బాలీవుడ్‌ వారికి కూడా ఆసక్తి పెరిగిపోతోంది. అందుకే మాలీవుడ్‌లో వస్తున్న హిట్ చిత్రాలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. మంచి కాన్సెప్ట్ కనిపిస్తే వెంటనే రైట్స్ తీసుకుని రీమేక్ స్టార్ట్ చేస్తున్నారు. పోయినేడు సక్సెస్ సాధించిన ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్‌’ని కూడా ఇప్పుడు పట్టుకుపోయారు.     

ఇదో సెన్సిటివ్ సబ్జెక్ట్. కేరళ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఓ మధ్య తరగతి యువతికి ఒక స్కూల్ టీచర్‌‌తో పెళ్లవుతుంది. మంచి డ్యాన్సర్‌‌గా పేరు తెచ్చుకోవాలని ఆమె కన్న కలలకి అక్కడితో ఫుల్‌స్టాప్ పడిపోతుంది. భర్తతో సహా అందరూ శాడిస్టులే. దాంతో పాపం పని మనిషికీ ఆమెకీ తేడా లేకుండా పోతుంది. ఆ కష్టాలన్నింటినీ చాలాకాలం పాటు ఓపికగా భరించిన ఆమె చివరికి ఆ పరిస్థితి నుంచి ఎలా బయట పడిందనేది కథ.       

స్టార్ హీరోలు లేకపోయినా డైరెక్టర్‌‌ జియో బేబీ రాసిన కథ బలంగా ఉండటం, స్క్రీన్‌ప్లే చక్కగా కుదరడం.. నటీనటుల  పర్‌‌ఫార్మెన్స్‌ కట్టి పడేయడంతో మంచి విజయం సాధించిందీ సినిమా. ఇప్పటికే తమిళంలో రీమేక్ అవుతోంది. ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్ చేస్తోంది. శాడిస్టు భర్తగా రాహుల్ రవీంద్రన్ నటిస్తున్నాడు. ఇప్పుడు హిందీలోనూ ఈ సినిమా రీమేక్ అవుతోంది. సాన్యా మల్హోత్రా లీడ్ రోల్ చేయబోతోంది.       

‘దంగల్‌’లో ఆమిర్‌‌ ఖాన్ చిన్న కూతురిగా కనిపించిన సాన్యా.. ఆ తర్వాత బధాయీ దో, ఫొటోగ్రాఫ్, లూడో, శకుంతలాదేవి లాంటి మంచి మంచి సినిమాల్లో నటించింది. సింపుల్‌గా కూడా ఉంటుంది కనుక ఆ పాత్రకి తను పర్‌‌ఫెక్ట్ అంటున్నారు డైరెక్టర్‌‌ ఆర్తీ కడవ్. నిజానికి ఈ సినిమా తెలుగులోనూ రీమేక్ కానుందని, ఓ స్టార్ హీరోయిన్ నటించబోతోందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఐశ్వర్యా రాజేష్‌తో కణ్నన్ తీస్తున్న సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రూపొందుతోంది కాబట్టి ఇక తెలుగులో రీమేక్ అయ్యే చాన్స్ లేనట్టే.