అయ్యప్ప క్లాస్.. భీమ్లా మాస్

ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకులను పలకరించబోతోంది ‘భీమ్లా నాయక్’. ఆల్రెడీ థియేట్రికల్ ట్రైలర్ కూడా లాంచ్ చేసేశారు. అది పవన్ అభిమానులనే కాక మెజారిటీ ప్రేక్షకులను  ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ట్రైలర్ చూసి కొందరు అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు బ్యాగ్రౌండ్ స్కోర్ సమస్య ఓ కారణం కాగా.. ‘అయ్యప్పనుం కోషీయుం’లో ఉన్న క్లాస్ టచ్ ఇందులో మిస్ కావడంతో ఇంకో కంప్లైంట్.

ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన అయ్యప్ప పాత్రతో బాగా కనెక్ట్ అయిన వాళ్లు.. ‘భీమ్లా నాయక్’లో పవన్ పాత్రను చూపించిన విధానం.. పవన్ అప్పీయరెన్స్, నటన విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బిజు పాత్ర, నటన సటిల్‌గా సాగితే.. పవన్ క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ కొంచెం మాస్‌గా, లౌడ్‌గా అనిపిస్తోంది. అయ్యప్ప పాత్ర ఎక్కడా కూడా హడావుడి చేయదు. చాలా గుంభనంగా కనిపిస్తుంది. కానీ ఏమీ మాట్లాడకుండా, పంచ్ డైలాగులు వేయకుండా, హడావుడి చేయకుండానే ఆ క్యారెక్టర్ ప్రేక్షకులపై బలమైన ముద్ర వేస్తుంది.

ఐతే ఆ పాత్రను మలయాళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీర్చిదిద్దాడు రచయిత, దర్శకుడు సాచీ. మలయాళ ప్రేక్షకులు క్లాస్‌గా, ఇలా సటిల్‌గా సాగే పాత్రలను ఇష్టపడతారు. తెలుగులో కూడా ఓ వర్గం ప్రేక్షకులకు అలాంటి పాత్రలు నచ్చుతాయి. కానీ పవన్ అభిమానులను, మన దగ్గర మెజారిటీ ఉండే మాస్ ప్రేక్షకులను మెప్పించాలంటే ఆ పాత్రను ఉన్నదున్నట్లుగా చూపిస్తే కష్టం. అంత క్లాస్‌గా, సటిల్‌గా ఉంటే మన ప్రేక్షకలకు కిక్ ఉండదు. పవన్ లాంటి మాస్ హీరోకు ఎలివేషన్లు లేకుండా, సటిల్‌గా ఆ పాత్రను నడిపిస్తే మన వాళ్లకు నీరసం వచ్చేస్తుంది.

అందుకే త్రివిక్రమ్, సాగర్ చంద్ర కలిసి ఆ పాత్రకు మాస్ టచ్ ఇచ్చినట్లున్నారు. పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఎలివేషన్ పెంచినట్లున్నారు. ఈ క్రమంలో ఆ క్యారెక్టర్ కొంచెం లౌడ్‌గా, మాసీగా తయారైంది. సింపుల్‌గా చెప్పాలంటే అయ్యప్ప క్లాస్ అయితే.. భీమ్లా మాస్. కాబట్టి అయ్యప్ప పాత్ర, బిజు నటనతో భీమ్లా నాయక్ క్యారెక్టర్‌ను-పవన్‌ యాక్టింగ్‌లో పోల్చి లోపాలు వెతకడంలో అర్థం లేదు.