ప్రస్తుతం సౌత్ ఇండియాలో నంబర్ వన్ సింగర్ ఎవరు అంటే మరో మాట లేకుండా సిద్ శ్రీరామ్ పేరు చెప్పేయొచ్చు. ఇటు తెలుగులో, అటు తమిళంలో అతను పాడుతున్న ప్రతి పాటా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సిద్ పేరు కనిపిస్తే చాలు.. మ్యూజిక్ లవర్స్ వెర్రెత్తిపోతున్నారు. అతడి పాటలకు కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి యూట్యూబ్‌లో. కేవలం సిద్ పాటల వల్ల సినిమాలు హిట్టయిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. అతడి పాటల వల్లే కొన్ని చిన్న సినిమాలకు మంచి హైప్ వచ్చింది. ఓపెనింగ్స్ వచ్చాయి.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల నుంచి చిన్న స్థాయి సంగీత దర్శకుల వరకు అతడి వైపే చూస్తున్నారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా అతడి వెంట పడుతున్నారు. సిద్ ఓ పాట పాడితే ఆడియోకు ఆటోమేటిగ్గా హైప్ వచ్చేస్తుందన్నది వాళ్ల ఆశ. చాలా సినిమాల విషయంలో ఇదే జరుగుతోంది.
ఐతే సిద్ పాటల్లో ఉండే శ్రావ్యత, వైవిధ్యం వరకు ఓకే కానీ.. పదాలను పలికే విషయంలోనే చాలా అన్యాయం జరిగిపోతోందన్నది భాషాభిమానుల బాధ.
ముఖ్యంగా తెలుగు పాటలు పాడేటపుడు అతను కానీ, సంగీత దర్శకులు కానీ.. భాష మీద అసలు శ్రద్ధ పెట్టట్లేదని.. తెలుగు పదాలు సిద్ నోట్లో పడి ఖూనీ అయిపోతున్నాయని సోషల్ మీడియాలో తెలుగు భాషా ప్రియులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఇప్పటికే అతను పాడిన చాలా పాటల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు సర్కారు వారి పాట నుంచి రిలీజైన కళావతి పాట విషయంలో అయితే భాషాభిమానుల బాధ ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. దూకినాయా.. మోగినాయా లాంటి పదాలను.. విడగొట్టి, ఒత్తులు చేర్చి దూకి…నాయ్యా, మోగి.. నాయ్యా అంటూ అతను పలికిన తీరు భాషాభిమానులకు అస్సలు రుచించడం లేదు. కళావతి.. కళ్ళు.. కుళ్ళబొడిచింది లాంటి పదాలను కూడా అతను సరిగా పలకలేదు. పాట ఎంత శ్రావ్యంగా ఉన్నప్పటికీ.. భాషను మాత్రం సిద్ కుళ్ళబొడిచేస్తున్నాడంటూ భాషా ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.