మొద‌లైంది కొత్త సినిమాల జాత‌ర‌

కొంత విరామం త‌ర్వాత మ‌ళ్లీ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప్రేక్ష‌కుల‌కు బోలెడంత వినోదాన్ని అందించ‌డానికి కొత్త సినిమాలు రెడీ అయిపోయాయి. థియేట‌ర్ల‌లోనే కాక ఓటీటీల్లో కూడా ఈ వారం సంద‌డి మామూలుగా ఉండేలా లేదు. వెండి తెర‌ల్లో, బుల్లి తెర‌ల్లో ఎవ‌రికి కావాల్సిన వినోదం వారికి రెడీగా ఉంది. థియేట్రిక‌ల్ రిలీజ్‌ల సంగ‌తి తీసుకుంటే ఈ వారాంతంలో నాలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుండ‌టం విశేషం.

అందులో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్న‌ది ర‌వితేజ సినిమా ఖిలాడినే అన‌డంలో సందేహం లేదు. కొత్త ఏడాదిలో రిలీజ‌వుతున్న అతి పెద్ద సినిమా ఇదే. సంక్రాంతికి బాక్సాఫీస్ క‌ళ త‌ప్ప‌గా.. ఆ త‌ర్వాతి మూడు వారాల్లో ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. మ‌ళ్లీ ఇప్పుడు ఖిలాడి లాంటి పెద్ద సినిమా రాక‌తో బాక్సాఫీస్ పుంజుకునేలా క‌నిపిస్తోంది. క్రాక్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ర‌వితేజ న‌టించిన సినిమా కావ‌డంతో దీనిపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. దీని ట్రైల‌ర్, పాట‌ల ప్రోమోలు, వాటిలో హీరోయిన్ల అందాలు ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచాయి. ఖిలాడి శుక్ర‌వారం ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తుంది.

ఇక‌ యూత్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న డీజే టిల్లు సినిమా ఆ త‌ర్వాతి రోజు థియేట‌ర్ల‌లోకి దిగుతుంది. ఈ సినిమా ట్రైల‌ర్ యువ‌త‌కు పిచ్చెక్కేసింద‌నే చెప్పాలి. చిన్న సినిమాల్లో క్రేజీ ఫిలింగా క‌నిపిస్తోందీ చిత్రం. ఇక శుక్ర‌వారం త‌మిళ అనువాద చిత్రం ఎఫ్ ఐ ఆర్‌తో పాటు.. సెహ‌రి అనే మ‌రో చిన్న సినిమా కూడా రిలీజ‌వుతోంది. వీటి ప్రోమోలు కూడా బాగానే అనిపిస్తున్నాయి.

మ‌రోవైపు ఓటీటీల్లోనూ సంద‌డి త‌క్కువ‌గా ఏమీ లేదు. ఆహాలో ప్రియ‌మ‌ణి సినిమా భామా క‌లాపం.. జీ తెలుగుతో సుమంత్ మూవీ మ‌ళ్ళీ మొద‌లైందితో పాటు.. విక్ర‌మ్ న‌టించిన త‌మిళ అనువాద చిత్రం మ‌హాన్ అమేజాన్‌లో రిలీజ‌వ్వ‌బోతున్నాయి. కాబ‌ట్టి ఈ వారం సినీ ప్రేమికుల‌కు పండ‌గ‌న్న‌ట్లే.