ముగ్గురు భామలతో ప్రభాస్ రొమాన్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. అవి పూర్తి కాకుండానే మరో సినిమా ఒప్పుకున్నారని సమాచారం. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నారట. దీనికి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ కూడా పెట్టినట్లు టాక్. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. ఈ సినిమాను చాలా వేగంగా పూర్తి చేయాలనేది మారుతి ప్లాన్. 

ప్రభాస్ కూడా చాలా తక్కువ రోజులు మాత్రమే కాల్షీట్స్ కేటాయిస్తున్నారట. దానికి తగ్గట్లే పక్కా ప్లానింగ్ తో షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమాలో రొమాన్స్ డోస్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. కథ ప్రకారం.. ప్రభాస్ ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారట. ముగ్గురూ కూడా క్రేజ్ ఉన్న హీరోయిన్లనే తీసుకోవాలనుకుంటున్నారు. 

ప్రభాస్ తో సినిమా అంటే ఏ హీరోయిన్ కాదంటుంది..? కాబట్టి స్టార్ హీరోయిన్లు రంగంలోకి దిగడం ఖాయం. రొమాంటిక్ సీన్స్ లో నటించాలంటే ప్రభాస్ కి చాలా సిగ్గు. ‘రాధేశ్యామ్’లో కొన్ని రొమాంటిక్ సీన్స్ ను డూప్స్ తో కానిచ్చేశారు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ అంటే ప్రభాస్ ఎలా నటిస్తారో చూడాలి.

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేయాలనుకుంటున్నారు. అందుకే ఒక లవ్ స్టోరీ, ఒక యాక్షన్ సినిమా, మైథలాజికల్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ అంటూ రకరకాల కాన్సెప్ట్ లతో సినిమాలు చేయబోతున్నారు. ఇప్పుడేమో రొమాంటిక్ డ్రామాలో కనిపించబోతున్నారు. మరి తన పెర్ఫార్మన్స్ తో ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి!