కోలీవుడ్ లో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు విష్ణు విశాల్. రానా నటించిన ‘అరణ్య’ సినిమాలో కీలకపాత్ర పోషించి తెలుగువారికి కూడా పరిచయమయ్యారు ఈ యంగ్ హీరో. ఇప్పుడు ఆయన నటిస్తోన్న తమిళ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. నిజానికి అతడు నటించిన ‘రాక్షసన్’ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలనుకున్నాడు. కానీ కుదరలేదు. దీంతో ఆ సినిమాను ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు విష్ణు విశాల్ నటించిన ‘ఎఫ్ఐఆర్’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగులో రవితేజ రిలీజ్ చేస్తుండడం విశేషం. దీని తరువాత విష్ణు చేసిన కొత్త సినిమాను కూడా రవితేజ బ్యానర్ ద్వారానే రిలీజ్ చేస్తున్నారట. ఈ విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా వెల్లడించారు.
రవితేజకు తన సినిమాలు బాగా నచ్చుతున్నాయని.. సినిమా కాన్సెప్ట్ లు విని తనకు కూడా ఇలాంటి సినిమాలు చేయాలనుందని రవితేజ తనతో అన్నారని చెప్పుకొచ్చారు విష్ణు విశాల్. రవితేజ నటించిన ‘ఖిలాడి’ సినిమా విడుదలవుతున్న ఫిబ్రవరి 11నే విష్ణు విశాల్ ‘ఎఫ్ఐఆర్’ సినిమా కూడా విడుదల కానుంది. తన సినిమా రిలీజ్ రోజునే తన సమర్పణలో మరో హీరో సినిమాను రవితేజ రిలీజ్ చేయాలనుకోవడం విశేషం.
సాధారణంగా అయితే ఏ హీరో దీనికి ఒప్పుకోరు. మరోపక్క రవితేజ ‘ఖిలాడి’ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. వారం రోజులు వెనక్కి తగ్గి ఫిబ్రవరి 18న సినిమా వస్తుందని అంటున్నారు. మరి దీనిపై రవితేజ అండ్ టీమ్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి!