షాకింగ్.. స్టార్ కమెడియన్ రిటైర్మెంట్!

ఉద్యోగాలకు రిటైర్మెంట్ ఉంటుంది కానీ.. వృత్తులకు ఉండదు. ముఖ్యంగా నటన అన్న వృత్తిలో ఉన్న వాళ్లకు రిటైర్మెంట్ అన్న మాటే ఉండదు. చాలా వరకు నటీనటులు అవకాశాలు తగ్గిపోయి కనుమరుగైపోతుంటారు కానీ.. తమకు తాముగా ఇక చాలు అనుకునే వాళ్లు.. ఆ మాట చెప్పి మరీ రిటైర్మెంట్ తీసుకునే వాళ్లు అరుదుగా ఉంటారు.

మంచి ఫాంలో ఉండి, అవకాశాలకు లోటు లేని ఆర్టిస్టులు తక్కువ వయసులో రిటైర్మెంట్ తీసుకున్న దాఖలాలు దాదాపు కనిపించవు. ఐతే నా రూటే వేరు అంటూ ఇప్పుడు టాలీవుడ్ స్టార్  కమెడియన్ రాహుల్ రామకృష్ణ రిటైర్మెంట్ ప్రకటన చేసి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. 2022నే నటుడిగా తన చివరి సంవత్సరం అని.. ఈ ఏడాదితో సినిమాలు ఆపేయబోతున్నానని అతను ట్విట్టర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.

అంతే కాక తాను ఇలా ప్రకటన చేస్తే ఎవరైనా పట్టించుకుంటారా అని కూడా కామెంట్ చేశాడు.రాహుల్ రామకృష్ణ సినిమాల్లోకి అడుగు పెట్టి ఐదేళ్లు కూడా కాలేదు. 2017లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ అతడి తొలి చిత్రం. ఆ సినిమాలో శివ పాత్రతో ఓవర్ నైట్ కమెడియన్‌గా స్టార్ డమ్ సంపాదించాడు. ఆ తర్వాత అతడికి బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. ఈ నాలుగైదేళ్లలో పదుల సంఖ్యలోనే సినిమాలు చేశాడు. త్వరలోనే విడుదల కాబోతున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లోనూ రాహుల్ కీలక పాత్ర పోషించాడు.

https://twitter.com/eyrahul/status/1489648833252704257?t=ANC5El0At7azl125d_f7vA&s=19

ఇప్పుడు అతడి కెరీర్ మంచి ఊపులో ఉంది. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సటిల్ కామెడీతో మెప్పించే రాహుల్‌ను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి వర్ధమాన దర్శకులు బాగా ఆసక్తి చూపిస్తుంటారు. కామెడీనే కాక సీరియస్ పాత్రలతోనూ తాను మెప్పించగలనని భరత్ అనే నేను, రిపబ్లిక్ లాంటి సినిమాలతో రుజువు చేశాడు రాహుల్. మరి ఇంత టాలెంట్ పెట్టుకుని, మంచి ఫాంలో ఉండి ఇంత త్వరగా రిటైరవ్వాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో ఏమో మరి.