తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు షార్ట్ టర్మ్‌లో బిగ్గెస్ట్ సీజన్ అంటే సంక్రాంతినే. ఆ సీజన్ సందడి అటు ఇటుగా వారం రోజులే ఉంటుంది. ఆ టైంలో ఒకేసారి మూణ్నాలుగు సినిమాలు రిలీజవుతుంటాయి. ఆ తర్వాత దసరాకు కూడా ఇలాగే తక్కువ వ్యవధిలో మూణ్నాలుగు సినిమాలు రిలీజవుతుంటాయి. ఐతే వారానికొకటి చొప్పున క్రేజీ సినిమాలు రిలీజై రెండు నెలల పాటు సందడి సాగే సీజన్ ఏదంటే వేసవి అనే చెప్పాలి.
ఏటా ఆ సీజన్లో భారీ చిత్రాలు పెద్ద ఎత్తున రిలీజవుతుంటాయి. మార్చి నెలాఖరు నుంచి మే చివరి వరకు వారానికొకటి చొప్పున పేరున్న సినిమాలు వస్తుంటాయి. ఏటా వేసవిలో మూణ్నాలుగు భారీ చిత్రాలు కూడా ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. కానీ కరోనా కారణంగా గత రెండేళ్లు వేసవి వెలవెలబోయింది. 2020లో సమ్మర్లో థియేటర్లు పూర్తిగా మూత పడగా.. గత ఏడాది ఏప్రిల్ మధ్యలో థియేటర్లు షట్ డౌన్ అయ్యాయి. దీంతో క్రేజీ సీజన్ వరుసగా రెండేళ్లు వెలవెలబోయింది.
ఐతే ఈసారి వేసవి సీజన్ నెవర్ బిఫోర్ అన్నట్లు ఉండబోతోంది. బహుశా ఈసారి ఉన్నంత బారీ చిత్రాల సందడి తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పుడూ ఉండి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలు ఈ వేసవిలోనే రాబోతున్నాయి. కరోనా మళ్లీ విజృంభిస్తే చెప్పలేం కానీ.. ప్రస్తుతానికి ఉన్న అంచనా ప్రకారం అయితే ప్రతి వారం ఒక క్రేజీ సినిమా ప్రేక్షకులను పలకరించబోతోంది.
మార్చి 11న ‘రాధేశ్యామ్’ వస్తే.. 25న ‘ఆర్ఆర్ఆర్’ సందడి చేయబోతోంది. అలాగే ఏప్రిల్‌లో ‘కేజీఎఫ్-2’ కూడా విడుదల కానుంది. ఇవి కాక ఆచార్య, భీమ్లా నాయక్ లాంటి పెద్ద సినిమాలు ఏప్రిల్‌లో రాబోతున్నాయి. ఇంకా సర్కారు వారి పాట, ఎఫ్-3, రామారావు ఆన్ డ్యూటీ, మేజర్, గని, అంటే సుందరానికి, పక్కా కమర్షియల్.. ఇలా వేసవిలో వచ్చే క్రేజీ సినిమాల లిస్టు పెద్దదే. ఇవన్నీ అనుకున్నట్లుగా రిలీజైతే 2022 సమ్మర్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.