కామెడీ మూవీతో హాసిని రీఎంట్రీ

హ హ హాసిని అంటూ ఒకప్పుడు కుర్రకారు గుండెలకు గేలాలు వేసి లాగింది జెనీలియా. కెరీర్‌‌ పీక్స్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్ నటుడు, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు అయిన రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లాడి ముంబై వెళ్లిపోయింది. అప్పటి నుంచి చాలాసార్లు ఆమె రీ ఎంట్రీ గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అవి ఇన్నాళ్లకి నిజమవుతున్నాయి.     

ఎట్టకేలకి జెనీలియా హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోంది. నిజానికి ఆమె నటనకు ఎప్పుడూ దూరమైపోలేదు. ఎప్పడైనా ఓ సినిమాలో గెస్ట్‌గా మెరుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయి హీరోయిన్‌గా వస్తోంది. తన భర్త రితేష్‌తో కలిసి ‘మిస్టర్ మమ్మీ’ అనే మూవీలో నటిస్తోంది జెనీ. షాద్ అలీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను కూడా వదిలారు.     

ఈ పోస్టర్ చూడటానికే చాలా ఫన్నీగా ఉంది. జెనీలియా ప్రెగ్నెంట్‌గా ఉంది. ఆమె పక్కనే ఉన్న రితేష్ కూడా బేబీ బంప్‌తో ఉన్నాడు. దాంతో ఇదేదో డిఫరెంట్‌ సబ్జెక్ట్ అనే ఫీలింగ్ కలుగుతోంది. అది ముమ్మాటికీ నిజమే అంటున్నారు మేకర్స్. ఇదో కామెడీ ఫిల్మ్ అని, ఆద్యంతం కడుపుబ్బ నవ్విస్తుందని చెబుతున్నారు.      

ఇలాంటి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నందుకు జెనీలియా కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. తన కెరీర్‌‌ బాలీవుడ్ మూవీతో స్టార్టయ్యింది. అందులో రితేష్ హీరో. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలోనూ అతనే హీరో కావడం ఎక్సయిటింగ్‌గా ఉందంటోందామె. మరి అప్పటిలాగే ఇప్పుడు కూడా బిజీ హీరోయిన్‌ అవుతుందో లేదో చూడాలి.