టాలీవుడ్లో సూపర్ ఫాస్ట్‌గా సినిమాలు తీసే దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. తన స్థాయి స్టార్ డైరెక్టర్లు చాలామంది స్క్రిప్టు తయారీకి, సినిమాకు కలిపి కనీసం ఏడాది సమయం తీసుకునేవారే. కానీ పూరి అలా కాదు. కొన్ని వారాల్లో స్క్రిప్టు రాసేసి.. మూణ్నాలుగు నెలల్లో సినిమాలు అవగొట్టేస్తుంటాడు. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన పోకిరికి సైతం ఇదే స్పీడ్ చూపించాడు పూరి. అందుకే ప్రస్తుత స్టార్ డైరెక్టర్లందరి కంటే చాలా ఎక్కువ సినిమాలు చేయగలిగాడు.
ఫాంలో ఉన్నా, లేకున్నా పూరిది అదే స్పీడు. సినిమాల మేకింగ్ విషయంలో నాన్చుడు ధోరణి ఎప్పుడూ లేదు పూరి విషయంలో. కానీ కరోనా, ఇతర కారణాల వల్ల ఆయన కొత్త సినిమా లైగర్ మాత్రం చాలా ఆలస్యం అయింది. ఈ సినిమా మొదలై దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇంకా కూడా విడుదలకు నోచుకోవట్లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
లైగర్ షూట్ అవగొట్టేశాక హిందీ పోస్ట్ ప్రొడక్షన్ బాధ్యతలను నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్‌కు అప్పగించేసి.. వేరే సినిమా మొదలుపెట్టేయబోతున్నాడు పూరి. అదే.. జనగణమన. లైగర్ హీరో విజయ్ దేవరకొండనే ఇందులో హీరో కాగా అతడి సరసన బాలీవుడ్ భామ జాన్వి కపూర్ కథానాయికగా నటించనుంది. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో మొదలు కాబోతోందట. ఫిబ్రవరిలోనే షూటింగ్ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట.
లైగర్ రిలీజయ్యే లోపే ఈ సినిమా షూటింగ్ అవగొట్టేసేలా పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నాడట పూరి. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే.. మరోవైపు లైగర్ తెలుగు పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలను చూడబోతున్నాడట ఆయన. లైగర్ బాగా లేటవడం వల్ల పూరికి, విజయ్‌కి జరిగిన నష్టాన్ని జనగణమనతో పూడ్చేయడానికే వేగంగా ఈ సినిమాను లాగించేయాలని చూస్తున్నారు. ఈ సినిమాకు స్క్రిప్టు కొన్నేళ్ల ముందే పూర్తవడం విశేషం. మహేష్ బాబు కోసం తయారు చేసిన ఆ కథను ఇప్పుడు విజయ్‌తో తీయబోతున్నాడు పూరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates