రాజమౌళి బాహుబలితో పాన్ ఇండియా లెవెల్లో చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్నాడు. ఈ మధ్యే పుష్ప సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాడు. పూరి జగన్నాథ్ ఒకప్పటి స్థాయిలో ఫాంలో లేకపోయినా సరే.. ‘లైగర్’ సినిమాతో ఆయన కూడా పాన్ ఇండియా లీగ్‌లోకి చేరుతున్నాడు. ఐతే టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో త్రివిక్రమ్ మాత్రమే పాన్ ఇండియా ఆలోచనలేవీ చేయట్లేదు.
ఆయన ఇప్పటిదాకా తీసిన సినిమాలన్నీ తెలుగు వాళ్లను మాత్రమే అలరించాయి. డబ్ చేసినా, రీమేక్ చేసినా కూడా త్రివిక్రమ్ చిత్రాలు వేరే భాషల్లో అంతగా ఆడిన దాఖలాలు లేవు. ఐతే వేరే స్టార్ డైరెక్టర్లందరూ పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటుతున్న నేపథ్యంలో మాటల మాంత్రికుడు అభిమానులు కొంచెం ఫీలవుతున్నారు. తమ అభిమాన దర్శకుడు కూడా పాన్ ఇండియా సినిమాలతో తనేంటో రుజువు చేయాలని కోరుకుంటున్నారు.
కానీ వేరే దర్శకులు ఆలోచనలు వేరు. వాళ్ల సినిమాలు వేరు. వాళ్లతో పోలిస్తే త్రివిక్రమ్ చేసేవి అచ్చ తెలుగు సినిమాలని చెప్పొచ్చు. త్రివిక్రమ్ సినిమాల మ్యాజిక్ అంతా కూడా ఆయన మాటల్లోనే ఉంటుంది. మాటలతో ఆయన చేసిన గారడీకి మన వాళ్లు ఫిదా అయిపోతుంటారు. ఎంటర్టైన్మెంట్లోనూ తెలుగుదనం ఉంటుంది. వేరే ఆకర్షణలు ఎన్ని ఉన్నా కూడా.. వినోదం, ఎమోషన్లు పండేది కేవలం త్రివిక్రమ్ మాటల వల్లే. కథల పరంగా చూస్తే త్రివిక్రమ్ చిత్రాల్లో అంత ప్రత్యేకత ఏమీ కనిపించదు. చాలా సాధారణంగా అనిపిస్తాయి ఆయన కథలు.
త్రివిక్రమ్ మార్కు సెన్సాఫ్ హ్యూమర్, ఎమోషనల్ టచ్‌తో సన్నివేశాలు మన వాళ్లను బాగా ఆకట్టుకుంటాయి. ఆయన సినిమాలను వేరే భాషల్లో రీమేక్ చేసినపుడు అవి సాధారణంగా అనిపించడానికి నేటివిటీ ఫ్యాక్టర్ మిస్ అవుతుండటం, మాటల్లో చాతుర్యం కనిపించకపోవడమే కారణం. త్రివిక్రమ్ లాగా వాళ్లు వినోదాన్ని పండించలేక పోవడం మైనస్ అవుతోంది. మన వాళ్ల మాదిరి త్రివిక్రమ్ సినిమాలతో వేరే వాళ్లు కనెక్ట్ కావట్లేదు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడం కాస్త కష్టమే అనిపిస్తోంది.