సూర్య సినిమా అక్షయ్ చేతికి

సౌత్‌లో హిట్టయిన సినిమాల్ని బాలీవుడ్‌కి పట్టుకుపోవడంలో అక్షయ్ కుమార్ తర్వాతే ఎవరైనా. మన రీమేక్స్‌తో చాలా విజయాలే అందుకున్నాడు తను. ఇప్పుడు మరో సౌత్ సూపర్ హిట్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఆ మూవీ మరేదో కాదు. సూర్య నటించిన ‘సూరారై పోట్రు’. సుధ కొంగర డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది.

‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. అక్కడా ఇక్కడా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఓటీటీలోనే రిలీజైనా అద్భుతమైన ఆదరణ పొందింది. హీరోగానే కాక నిర్మాతగానూ సూర్యని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది.     

అందుకే ఈ సినిమాని హిందీలోకి రీమేక్ చేయడానికి రెడీ అయ్యింది సూర్య బృందం. అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ ఇచ్చి కూడా చాలా రోజులయ్యింది. కానీ ఆ తర్వాత రీమేక్ రైట్స్ విషయంలో ఏవో సమస్యలు రావడంతో ఇతర వివరాలు రివీల్ చేయడానికి కాస్త ఆలస్యమైంది. ఆ సమస్య తీరిపోయింది. ఎట్టకేలకి ఇప్పుడో అప్‌డేట్ కూడా బైటికొచ్చింది.       

ఈ చిత్రంలో హీరోగా హృతిక్ రోషన్, అజయ్ దేవగన్, జాన్ అబ్రహామ్, అక్షయ్ కుమార్‌‌ల పేర్లను పరిశీలించిన టీమ్.. చివరికి అక్షయ్‌ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సీరియస్ సినిమాలకు అక్కీ కేరాఫ్. ఎమోషన్స్‌ని కూడా బాగా పండిస్తాడు. పైగా బాక్సాఫీస్ కింగ్ కూడాను. అందుకే ప్రాజెక్ట్ నేరుగా వెళ్లి అక్షయ్ చేతిలో పడిందట. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందంటున్నారు.