కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య జీవితం కొన్ని నెలల వ్యవధిలో పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా గత కొన్నిరోజుల్లో ఆయన జీవితంలో వచ్చిన మార్పు అసాధారణమైంది. కేంద్ర ప్రభుత్వం కళకు ఆయన చేసిన సేవల్ని గుర్తించి పద్మశ్రీ పురస్కారం అందిస్తే.. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆయనకు ఇల్లు, ఇతర సౌకర్యాల కోసమని కోటి రూపాయల నజరానాను ప్రకటించింది. ఇదంతా బాగానే ఉంది కానీ.. కొన్ని నెలల ముందు వరకు ఆయన పరిస్థితి ఏంటన్నది ఒకసారి పరిశీలించాలి.
ఎన్నో ఏళ్ల పాటు ఆర్థిక ఇబ్బందులతో అవస్థ పడ్డారాయన. తాను నమ్ముకున్న కళ ఆయనకు పెద్దగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చలేదు. సొంత ఇల్లు లేక పూట గడవడం కూడా కష్టమై ఇబ్బంది పడ్డారాయన. అలాంటి వ్యక్తికి అనుకోకుండా ‘భీమ్లా నాయక్’ సినిమాలో పాట పాడే అవకాశం వచ్చింది. అది కూడా పూర్తి పాట కాదు. పాట పల్లవి వరకు పాడాడు. ఆయన పాటల స్ఫూర్తితోనే ఈ సాంగ్‌ను కంపోజ్ చేశాడు తమన్.
మొగిలయ్య పరిస్థితి తెలిసి పవన్ కళ్యాణ్ ఆయనకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇలా పాపులారిటీ రావడంతో ఆయనపై ప్రభుత్వాల దృష్టి పడింది. కేంద్ర ప్రభుత్వం పురస్కారం అందించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ఇచ్చింది. కానీ ఒక సినిమా ద్వారా పాపులర్ అయితే తప్ప ఒక పేద కళాకారుడిని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరం. నిజానికి ‘భీమ్లా నాయక్’తో వచ్చిన పాపులారిటీతో మొగిలయ్య కాస్త జీవితంలో స్థిరపడ్డాడు.
ఇప్పుడు ఆయనకొచ్చిన పాపులారిటీ చూసి ప్రభుత్వాలు అవార్డులు, రివార్డులు ఇచ్చేస్తున్నాయి. ఆయనకు అవసరానికి మించి ఇప్పుడు సాయాలు అందుతున్నాయి. ప్రభుత్వాలతో వచ్చిన సమస్య ఇదే. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నపుడు ఎవరూ పట్టించుకోరు. పాపులారిటీ వస్తే పిలిచి సన్మానాలు చేస్తారు. నజరానాలు ఇస్తారు. క్రీడల్లో కూడా ఇదే జరుగుతుంటుంది. సరైన వసతులు, ఆర్థిక సాయం అందక ఎంతోమంది పేద క్రీడాకారులు నానా అవస్థలు పడుతుంటారు. వారిని ఎవరూ పట్టించుకోరు. సింధునో, సానియానో ఏదైనా గెలిచి వస్తే నజరానాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు పోటీ పడుతుంటాయి. ఆల్రెడీ పాపులర్ అయి.. బోలెడంత డబ్బున్న వాళ్లకు కోట్లల్లో నజరానాలు ఇచ్చేస్తుంటారు. మొగిలయ్య వాళ్లంత డబ్బున్న వాడు కాకపోవచ్చు కానీ.. ఇప్పుడు ఆయనకు పాపులారిటీ వచ్చింది కాబట్టే అవార్డులు, రివార్డులు అన్నది స్పష్టం. మొగిలయ్యలా ఇబ్బంది పడుతున్న పేద కళాకారుల్ని గుర్తించి సాయం అందించాలన్న దృష్టి మాత్రం ఉండదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates