పాయె.. వ‌చ్చిందతా పాయె

మ‌హా న‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రానికి కీర్తి సురేష్‌ను ఎంచుకున్న‌పుడు చాలామంది అవాక్క‌య్యారు. నేను శైల‌జ సినిమాలో మూడీగా క‌నిపిస్తూ పెద్ద‌గా న‌ట‌నే రాన‌ట్లు క‌నిపించిన అమ్మాయితో సావిత్రి పాత్ర చేయించ‌డం ఏంటి అంటూ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. సావిత్రిని అనుక‌రించ‌డానికైనా ఒక స్థాయి ఉండొద్దా అన్నారు.

నిత్య మీన‌న్ లాంటి వాళ్లే ఈ పాత్ర‌కు క‌రెక్ట్ అని అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ త‌న గురించి నెగెటివ్‌గా మాట్లాడిన అంద‌రూ ముక్కున వేలేసుకుని చూసేలా చేసింది కీర్తి. మ‌హాన‌టిలో ఆమె అభిన‌యానికి ఆశ్చ‌ర్య‌పోని వారు లేరు. ఆ సినిమాతో కీర్తికి వ‌చ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఏకంగా ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డు గెలుచుకోవ‌డ‌మే కాక‌.. మంచి మార్కెట్ కూడా సంపాదించింది. ఈ దెబ్బ‌తో లేడీ ఓరియెంటెడ్ సినిమాల క‌థ‌లు ఆమెను వెతుక్కుంటూ వ‌చ్చేశాయి. కానీ వాటిలోంచి స‌రైన క‌థ‌ల్ని ఎంచుకోవ‌డంలోనే కీర్తి త‌డ‌బ‌డింది.

త‌న‌ను లీడ్ రోల్‌లో పెట్టి పేరున్న ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు సినిమాలు తీయ‌డానికి ముందుకొచ్చేస‌రికి కీర్తి ఎగ్జైట్ అయిపోయిన‌ట్లుంది త‌ప్ప‌.. వీటిలో త‌న ఇమేజ్‌ను నిల‌బెట్టేవి, పెంచేవి ఏవి అని చూడ‌లేదు. ఇంత‌కుముందు వ‌చ్చిన పెంగ్విన్, మిస్ ఇండియా.. ఇప్పుడొచ్చిన గుడ్ ల‌క్ స‌ఖి.. వీటిలో క‌నీస స్థాయిలో చెప్పుకునే సినిమా ఒక్క‌టీ లేదు.

మూడూ ఒక‌దాన్ని మించి ఇంకోటి చెత్త సినిమా. ముందుగా పెంగ్విన్ చూసి ఇదేం సినిమా అనుకుంటే.. ఆ తర్వాత వ‌చ్చిన మిస్ ఇండియా చూసి ముందుదే బెట‌ర్ అనిపించింది. ఇప్పుడు గుడ్ ల‌క్ స‌ఖి చూసి పెంగ్విన్ దీంతో పోలిస్తే చాలా మెరుగు అనుకుంటున్నారు. మ‌రీ ఇంత పేల‌వ‌మైన క‌థ‌ల్ని కీర్తి ఎలా ఓకే చేసి సినిమాలు చేసేసిందో అర్థం కాదు. కాస్తో కూస్తో ఉన్న పేరును గుడ్ ల‌క్ స‌ఖి పూర్తిగా చెడ‌గొట్టేసిన‌ట్లే. మ‌హాన‌టితో వ‌చ్చిన గుర్తింపంతా పోయిన‌ట్లే. ఇక కీర్తి లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే ప్రేక్ష‌కులు ఒక దండం పెట్టేసేలా ఉన్నారు.