ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్‌.. ఓ గుడ్ న్యూస్

సంక్రాంతి సీజన్లో కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు రావాలని చూసిన భారీ చిత్రాలు ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ అనూహ్య పరిస్థితుల మధ్య వాయిదా పడిపోయాయి. ఉన్నట్లుండి  దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడం.. థియేటర్లపై ఆంక్షలు మొదలవడం.. కొన్ని చోట్ల మొత్తంగా థియేటర్లే మూత పడటమే ఇందుక్కారణం. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ వాయిదాకు దారి తీసిన కారణం.. ఢిల్లీలో థియేటర్లు మూత పడటం. కరోనా థర్డ్ వేవ్ విషయంలో ముందుగా ఆంక్షలు మొదలైంది అక్కడే.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా జనాలు ఎక్కువగా గుమిగూడే థియేటర్లను మూత వేయించేశారు. ఢిల్లీ లాంటి పెద్ద సిటీలో థియేటర్లు మూత పడ్డాక ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రాన్ని ఇక ఏమని రిలీజ్ చేస్తారు? తర్వాత మరిన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు మొదలవడం.. ముఖ్యంగా నార్త్ ఇండియాలో వసూళ్లకు బాగా కోత పడేలా ఉండటంతో దీంతో పాటుగా ‘రాధేశ్యామ్’ను వాయిదా వేయక తప్పలేదు.

ఐతే మళ్లీ ఫిబ్రవరి చివరికి కానీ ఉత్తరాదిన థియేటర్లు పూర్తి స్థాయిలో నడవవని.. ఢిల్లీలో ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకోవని అంచనా వేస్తుండగా.. అనూహ్యంగా ఆ రాష్ట్రంలో వెండి తెరల్లో మళ్లీ వెలుగులు నింపే నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. కరోనా కేసులు ఎంతగా పెరిగినప్పటికీ వైరస్ ప్రభావం పెద్దగా లేకపోవడం.. సీరియస్ కేసులు చాలా తక్కువగా ఉండటంతో ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆంక్షల్ని సడలిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో థియేటర్లను పున:ప్రారంభించడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. కాకపోతే 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని షరతు విధించారు.

ఆ రకంగా అయినా థియేటర్లు నడపిించడానికి సంతోషమే. కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకముందే ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యమే. ఐతే వైరస్ గురించి ఇంకెంతమాత్రం భయపడాల్సిన పని లేదన్న ఆలోచన రావడమే ఇందుక్కారణం కావచ్చు. ఢిల్లీలో సడలింపులు వచ్చాయంటే.. మిగతా చోట్ల కూడా నెమ్మదిగా షరతులు తొలగబోతున్నట్లే. పరిస్థితి చూస్తుంటే వచ్చే నెలాఖరుకల్లా థియేటర్లు మునుపటిలా నడిచేట్లే కనిపిస్తున్నాయి. కాబట్టి మార్చి-ఏప్రిల్ నెలల్లో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సహా షెడ్యూల్ అయిన భారీ చిత్రాలు ప్రేక్షకులను పలకరించే అవకాశాలున్నట్లే.