దర్శనం మొగిలయ్య.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో తెలుగు వారిని బాగా ఆకర్షించిన పేర్లలో ఇదొకటి. ఈ పేరు కొన్ని నెలల ముందే వార్తల్లోకి వచ్చింది. కనుమరుగవుతున్న 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికించడంలో ఈ కళాకారుడిది ప్రత్యేక నైపుణ్యం. కానీ ఆ నైపుణ్యం జనాలకు చేరక.. ఆయనకు ఆర్థిక ఆసరా అందక ఏడాది ముందు వరకు దయనీయ స్థితిలో ఉన్నాడు మొగిలయ్య.
ఊరూరా తిరిగి కిన్నెరపై స్వరాలు పలికిస్తూ, పాటలు పాడుతూ ఏదో అలా జీవనం సాగిస్తూ వచ్చిన మొగిలయ్యకు భీమ్లా నాయక్ సినిమా వరంలా మారింది. ఈ చిత్రంలో టైటిల్ సాంగ్కు గతంలో మొగిలయ్య పాటల నుంచి స్ఫూర్తి పొందడమే కాదు.. ఆయనతో ఈ పాట పల్లవిని పాడించాడు తమన్.
బేసిగ్గానే జానపద పాటలన్నీ, వాటిని పాడే కళాకారులన్నా ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించే పవన్ కళ్యాణ్.. మొగిలయ్యను పిలిచి సత్కరించడమే కాదు.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయనకు రూ.2 లక్షల ఆర్థిక సాయం కూడా అందించాడు. పవన్ సినిమాలో పాట పాడటం, పవన్ చేతుల మీదుగా సత్కారం అందుకోవడంతో మొగిలయ్య గురించి అందరికీ తెలిసింది. మొగిలయ్య ప్రతిభను తక్కువ చేయడం కాదు కానీ.. ఆయన గురించి జనాలకు తెలిసేలా చేయడంలో పవన్ పాత్ర కీలకం.
ఇన్నేళ్లలో ఎన్నడూ మొగిలయ్యను గుర్తించని ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఆయనకు తగిన గౌరవాన్నిచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం కళల కేటగిరీలో ఆయన పేరును పద్మ పురస్కారానికి ప్రతిపాదిస్తే.. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. కొన్ని నెలల వ్యవధిలో తన జీవితం ఇంతలా మారిపోతుందని, తనకు ఇంత పేరు ప్రఖ్యాతులు వస్తాయని మొగిలయ్య ఊహించి ఉండకపోవచ్చు. ఈ మార్పులో పరోక్షంగా పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates