కారవాన్ కొన్న సీనియర్ ఆర్టిస్ట్

Naresh

కారవాన్ కలిగి ఉండటం ఇప్పుడు స్టార్ హీరోలకు స్టేటస్ సింబల్. ఇండియా వరకు చూస్తే ముందుగా బాలీవుడ్లో మొదలైన కారవాన్ కల్చర్.. ఇప్పుడు సౌత్ ఇండియా అంతటా కూడా విస్తరించింది. ఒకప్పుడు నిర్మాతలే స్టార్ హీరోలు, హీరోయిన్ల కోసం కారవాన్లు ఏర్పాటు చేసేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో కథ మారింది.

ఎవరెవరో వాడిన కారవాన్లను మళ్లీ తాము ఉపయోగించకుండా.. తామే వ్యక్తిగతంగా వాటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. కోట్లు ఖర్చు పెట్టి తమ అభిరుచికి తగ్గట్లు, తము అత్యంత సౌకర్యంగా ఉండేలా కారవాన్లను  తీర్చిదిద్దుకుంటున్నారు. ఐతే ఇక్కడ మళ్లీ ఇంకో మెలిక ఉంది. వాటికి రోజు వారీ బిల్లు నిర్మాత చెల్లించాల్సి ఉంటుంది.

ఆ రకంగా పెట్టుబడి రికవరీ కూడా జరిగిపోతుంటుంది. ఐతే చాలా వరకు స్టార్ హీరోలకే ఇలాంటి ఏర్పాటు ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్లులు ఇలా వ్యక్తిగతంగా కారవాన్లు ఏర్పాటు చేసుకోవడం అరుదు.  కొందరు సీనియర్ ఆర్టిస్టులకు నిర్మాతలు కారవాన్లు ఏర్పాటు చేస్తారు కానీ.. వాళ్లకు వాళ్లుగా ఈ ఏర్పాటు చేసుకోవడం దాదాపు కనిపించదు.

ఐతే టాలీవుడ్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ సొంతంగా కారవాన్ కొనుక్కోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆ నటుడే.. నరేష్. హీరో వేషాలు ఆగిపోయాక పదేళ్లకు పైగా ఆయనకు పెద్దగా అవకాశాలు లేవు. కానీ గత కొన్నేళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు తెలుగులో మంచి డిమాండున్న క్యారెక్టర్ నటుల్లో ఆయనొకరు. ఏ పాత్ర ఇచ్చినా.. అలవోకగా చేసుకుపోయే ఆయన చేతుల్లో అరడజనుకు పైగా సినిమాలున్నాయిప్పుడు.

తీరిక లేకుండా షూటింగుల్లో పాల్గొంటూ బాగా సంపాదిస్తున్న ఆయన ముంబయి నుంచి ఒక లగ్జరీ సెకండ్ హ్యాండ్ కారవాన్ కొనుక్కున్నారు. రేటు వెల్లడించలేదు కానీ.. స్టార్ హీరోల కారవాన్లకు ఏమాత్రం తగ్గని స్థాయిలోనే ఉందట ఈ వెహికల్. కొవిడ్ టైంలో వేరే వాళ్లు ఉపయోగించిన కారవాన్లను వాడటం మంచిది కాదన్న ఉద్దేశంతోనే తాను ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. మరి స్టార్ హీరోల లాగే ఈయన కూడా నిర్మాతల నుంచి పారితోషకంతో పాటు రోజువారీ కారవాన్ బిల్ కూడా బిల్ చేసేంత లగ్జరీ ఉంటుందా అన్నది ప్రశ్న.