ఇది క‌దా ఇంద్ర‌గంటి నుంచి కోరుకునేది

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌.. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఒక పేజీని కేటాయించేలా చేసుకున్న ద‌ర్శ‌కుడు. ఏమంత మెగా హిట్లు తీసేశాడ‌ని చ‌రిత్ర‌లో ఆయ‌న‌కో పేజీ అనేవాళ్లు కొంద‌రుండొచ్చు. కానీ అత‌డిలా చ‌క్క‌టి తెలుగుద‌నంతో, కొత్త‌ద‌నంతో, తాజాద‌నంతో సినిమాలు తీసేవాళ్లు అరుదు. అంద‌రూ త్రివిక్ర‌మ్‌ను మాట‌ల మాంత్రికుడు అంటుంటారు కానీ.. నిజానికి ఇంద్ర‌గంటి కూడా మాట‌ల మాంత్రికుడే. కాక‌పోతే త్రివిక్ర‌మ్‌లా ఆయ‌న మాట‌ల్లో ప్రాస‌లు, పంచులు ఉండ‌వు. కానీ అందంగా, ఆలోచ‌న రేకెత్తించేలా మాట‌లు రాసి న‌వ్వించ‌గ‌ల‌, ఏడిపించ‌గ‌ల స‌మ‌ర్థుడు ఇంద్ర‌గంటి.

గ్ర‌హ‌ణం లాంటి ఆఫ్ బీట్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్, స‌మ్మోహ‌నం లాంటి చిత్రాల‌తో ఇంద్ర‌గంటి క‌మ‌ర్షియ‌ల్‌గానూ స‌త్తా చాటుకుని త‌న‌కంటూ ఓ అభిమాన వ‌ర్గాన్ని ఏర్ప‌రుచుకున్నాడు.

ఐతే ఇంద్ర‌గంటి అభిమానులంద‌రినీ వి మూవీ బాగా హ‌ర్ట్ చేసేసింది. ఆయ‌న ఇలాంటి సినిమా తీయ‌డ‌మేంటంటూ అంద‌రూ అసంతృప్తి రాగం అందుకున్నారు. ఇలాంటి సినిమాలు తీయ‌డానికి ఎంతమంది ద‌ర్శ‌కులు లేరు, మీరు మీ స్ట‌యిల్లో సినిమా తీయండ‌ని విన్న‌వించుకున్నారు. ఇప్పుడు అభిమానులు కోరుకునే, త‌న మార్కు మూవీనే తీసిన‌ట్లున్నాడు ఇంద్ర‌గంటి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. అంటూ టైటిల్‌తోనే మంచి ఫీల్ ఇచ్చిన ఇంద్ర‌గంటి.. ఇప్పుడు టీజ‌ర్‌తో వారెవా అనిపించాడు.

టీజ‌ర్ ఆద్యంతం ఇంద్ర‌గంటి బెస్ట్ మూవీ స‌మ్మోహ‌నం ఫీల్స్ క‌నిపించాయి. అందులో మాదిరే ఇక్క‌డా క‌థ సినిమాల చుట్టూ తిర‌గ‌డం విశేషం. కొంత స‌మ్మోహ‌నం హ్యాంగోవ‌ర్లో ఇంద్ర‌గంటి ఉన్న‌ట్లుగా క‌నిపించినా.. అదేమంత ఇబ్బంది పెట్టే విష‌యం కాదు. ఆయ‌న మ‌రోసారి త‌న మార్కుతో మ్యాజిక్ చేయ‌బోతున్న‌ట్లు టీజ‌ర్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. స‌మ్మోహ‌నం త‌ర్వాత త‌డ‌బ‌డ్డ సుధీర్ బాబు కూడా ఈ సినిమాతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కేలాగే క‌నిపిస్తున్నాడు.